Petrol Price: 


రూ.15కే లీటర్ పెట్రోల్ ఎలా..?


కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పెట్రోల్ ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లీటర్ పెట్రోల్ ధర రూ.15కే వచ్చే అవకాశముందని అన్నారు. కానీ...దానికో కండీషన్ ఉందని చెప్పారు. 60% ఇథనాల్, 40% విద్యుత్‌ని కలిపేసి ఇంధనంగా మార్చుకుంటే...పెట్రోల్ ధర భారీగా తగ్గిపోతుందని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు నితిన్ గడ్కరీ. అంతే కాదు. ఈ టెక్నిక్‌తో వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుందని స్పష్టం చేశారు. ఇక చమురు దిగుమతుల కోసం ఖర్చు కూడా భారీగా తగ్గిపోతుందని వివరించారు. 


"చమురు దిగుమతులో కోసం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అదే 60% ఇథనాల్, 40% విద్యుత్‌ని ఇంధనంగా మార్చుకుంటే లీటర్ పెట్రోల్ రూ.15కే వచ్చేస్తుంది. అంతే కాదు. చమురు దిగుమతి కోసం చేస్తున్న ఖర్చుని రైతుల కుటుంబాలకు మళ్లించవచ్చు"


- నితిన్ గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి






రైతుల కోసం..


ఇదే ప్రసంగంలో రైతుల గురించి ప్రస్తావించారు గడ్కరీ. వాళ్ల జీవితాలను మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వాళ్లను అన్నదాతలుగానే కాకుండా శక్తిదాతలుగానూ (Energy Providers) మార్చాలని అన్నారు. ఇథనాల్‌ని మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేస్తారు. చెరకు పిప్పి నుంచి దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దీన్ని వాహనాలకు ఇంధనంగా మార్చుకుంటే చాలా వరకు ఖర్చులు తగ్గించుకోవచ్చు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడే పరిస్థితుల నుంచి ఊరట కల్పిస్తామని, అందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఐదేళ్లలో వీటిని వినియోగం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 


ప్రత్యామ్నాయం లేదా..?


గడ్కరీ చెప్పినట్టుగా 60% మేర ఇథనాల్‌ ఉత్పత్తి చేయాలంటే వేల లీటర్ల నీళ్లు అవసరముతాయి. చెరకు పంట సాగు చేయాలంటే నీళ్లు ఎక్కువగా అవసరం. అంతే కాదు. చెరకు సాగు చేసిన చోట నేల పొడిబారిపోతుంది. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే...చెరకు నుంచి ఓ లీటర్ ఇథనాల్‌ని తయారు చేయాలంటే...అందుకోసం 2,860 లీటర్ల నీళ్లు ఖర్చవుతాయి. అంటే భారీ మొత్తంలో ఇథనాల్‌ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని లక్షల నీటర్లు అవసరమవుతాయో ఊహించుకోవచ్చు. ఫలితంగా...నీటి కొరత ముంచుకొచ్చే ప్రమాదముంది. అందుకే...ఇథనాల్‌ని ఉత్పత్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని నీతి ఆయోగ్ గతంలోనే సూచించింది. ఇప్పటికి కొన్ని కంపెనీలు ఇథనాల్‌ని కృత్రిమమైన పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. కొద్ది రోజుల పాటు వాహనాలను బాగానే నడిచినా...క్రమంగా ఈ ఫ్యుయెల్ కారణంగా అవి దెబ్బ తింటాయి. అంతే కాదు. పొల్యూషన్ కూడా పెరుగుతుంది. వెహికిల్ పార్ట్స్ పాడైపోతాయి. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఇథనాల్‌ని సరైన పద్ధతిలో ఉత్పత్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 


Also Read: మహారాష్ట్ర రాజకీయాల్లోకి 'బాహుబలి' ఎంట్రీ, మరోసారి ట్రెండ్ అవుతున్న ఆ ఎపిక్ సీన్