Tamil Nadu: తమిళనాడులోని కడలూరులో విషాదం జరిగింది. నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఏడుగురు అమ్మాయిలు మృతి చెందారు.







ఇదీ జరిగింది


నెల్లికుప్పం అరుంగుణం సమీపంలోని కెడిలం నదిలో స్నానానికి వెళ్లారు ఏడుగురు అమ్మాయిలు. పరిసర గ్రామాలకు చెందిన అమ్మాయిలు ఆదివారం మధ్యాహ్నం నదిలో స్నానానికి వచ్చారు. వారు నీటిలో దిగిన కొంతసేపటికి నీటి ప్రవాహం పెరిగింది.


అయితే నదిలో స్నానానికి వెళ్లిన సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోయారు. వీరిని కాపాడే ప్రయత్నంలో వెళ్లిన ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయారు. అక్కడున్నవారు ఇది గమనించి నదిలో దిగి వారిని బయటికి తీశారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ అమ్మాయిలు మృతి చెందారు.


సమాచారం అందుకున్న మృతుల బంధువులు, కుటుంబం సభ్యులు కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. సరదాగా స్నాసానికి వెళ్లి వస్తామని చెప్పి విగతజీవులు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. 


మరణించిన అమ్మాయిలు సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోనిష (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)గా గుర్తించారు. వీరంతా కుచ్చిపాలయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారు. వారిలో ప్రియదర్శిని, దివ్యదర్శిని అక్కాచెల్లెళ్లు.


పరిహారం


ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.


Also Read: North Korea: ఏందన్నా ఆ దూకుడు- 8 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్!


Also Read: Philadelphia Gunfire: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా- ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు