కాన్‌పూర్ అల్లర్లు: భాజపా నేతలు సస్పెండ్
కాన్‌పూర్ అల్లర్లు యూపీ వ్యాప్తంగా అలజడికి కారణమయ్యాయి. చినికి చినికి గాలి వానగా మారిన ఈ గొడవను సద్దుమణిగేలా చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిచాల్సి వచ్చింది. రెండు వర్గాలూ తప్పు మీదంటే మీదంటూ విమర్శలు చేసుకుంటూ వీధుల్లోకి వచ్చి రాళ్లతో దాడి చేసుకున్నాయి. బాంబులనూ విసురుకున్నాయి. ఈ కేసులో 36 మందిని అరెస్టు చేసిన పోలీసులు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాయి. ఈ క్రమంలోనే వివాదానికి కారణమైన భాజపా నేతలను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నామని భాజపా అదిష్ఠానం స్పష్టం చేసింది. భాజపా నియమావళిలోని రూల్ నంబర్ 10ని అతిక్రమిస్తూ వ్యాఖ్యలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్య కార్యదర్శి ఓమ్ పఠక్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయటంతో పాటు విచారణకూ ఆదేశించారు.
అన్ని మతాలపైనా మాకు గౌరవం ఉంది: భాజపా
అన్ని మతాలపైనా తమకు గౌరవం ఉందని, మనోభావాలు దెబ్బ తీసేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా సహించమని తేల్చి చెప్పింది భాజపా. ఇతర మతాల వారిని ద్వేషించే వైఖరిని భాజపా ఏ మాత్రం ఉపేక్షించదని స్పష్టం చేసింది. భారత రాజ్యాగం ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించే హక్కు కల్పించిందని, ఆ హక్కుని తప్పకుండా గౌరవించాలని వ్యాఖ్యానించింది యూపీ భాజపా. ఆజాదీ కా అమృతోత్సవ్ జరుపుకుంటున్న ఈ సమయంలో దేశంలో అందరూ సమున్నతంగా జీవించాలని తాము ఆకాంక్షిస్తున్నామని, అలాంటి వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. పార్టీ సస్పెన్షన్‌పై స్పందించారు నుపుర్ శర్మ. ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయలేదని, తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఎవరినీ ఉపేక్షించకండి: సీఎం యోగి
భాజపా నేత నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేయటంపై ఆ వర్గ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్కెట్ మూసి వేయాలంటూ ఓ వర్గానికి చెందిన వారు డిమాండ్ చేయగా మరో వర్గం ఇందుకు అంగీకరించలేదు. ఫలితంగా ఒక్కసారిగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలైంది. ఓ టీవీ షో వేదికగా భాజపా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీశాయంటూ స్థానిక ముస్లిం సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. ఉన్నట్టుండి గొడవ పెద్దదైంది. ఈ ఘర్షణలు జరిగిన సమయంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌కి వచ్చారు. అల్లర్లు అదుపు తప్పకముందే పోలీసులు కట్టడి చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఈ అల్లర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దాడుల వెనక ఎవరున్నా సహించకూడదని, కఠినంగా శిక్షించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.