North Korea: ఓవైపు ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం సృష్టిస్తుంటే మరోవైపు అధినేత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం క్షిపణి పరీక్షల్లో దూకుడుగా ఉన్నారు. ఆదివారం ఏకంగా ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కిమ్ ప్రయోగించారు. ఈ మేరకు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.
స్వల్ప వ్యవధిలో
ప్యాంగ్యాంగ్‌లోని సునాన్ ప్రాంతం నుంచి 8 స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. వాటిని జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తమ సైన్యాన్ని అప్రమత్తం చేశామన్నారు. 35 నిమిషాల వ్యవధిలో ఈ క్షిపణులను ప్రయోగించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ప్రయోగాలను జపాను కూడా ధ్రువీకరించింది. అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో పరీక్షలు జరపడం అసాధారణ విషయమని జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి ఆందోళన వ్యక్తం చేశారు.
కీలక సమయంలో
నాలుగేళ్ల తర్వాత అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహించిన మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన మరుసటిరోజే ఈ ప్రయోగాలు చేపట్టారు కిమ్. 2017 తర్వాత మొదటిసారి పరీక్షించిన ఫుల్ రేంజ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సహా ఇప్పటివరకు ఉత్తర కొరియా 17 పరీక్షలు నిర్వహించింది.
కరోనా కలవరం
మరోవైపు ఉత్తర కొరియాలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 79 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఉత్తర కొరియా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో కూడా కిమ్.. క్షిపణి పరీక్షలపై దృష్టి పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.
గతేడాది పలు దేశాలు ఉత్తరకొరియాకు ఆస్ట్రాజెనెకా, చైనా తయారీ టీకాలను ఆఫర్ చేశాయి. కానీ, ఉ.కొరియా మాత్రం లాక్ డౌన్, సరిహద్దుల మూసివేతతోనే వైరస్‌ను అదుపు చేస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయిదాటిపోయినట్లు కనిపిస్తున్నాయి. మరి కిమ్ జోంగ్ ఉన్ ఏం చేస్తారో చూడాలి.
Also Read: Philadelphia Gunfire: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా- ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు