Freebies By Political Parties: ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ప్రకటించే ఉచితాల హామీలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఉచితాల ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ క్రిష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణ చేసింది. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే అడ్డూ అదుపూ లేని ఉచితాలను కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం నియంత్రించాలని లేదా రాజకీయ పార్టీలను బాధ్యులను చేయాలని పిటిషనర్ ఆ పిల్ లో కోరారు.


విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘ఉచితాల అంశం చాలా సీరియస్. కానీ, రాజకీయ పార్టీలను రద్దు చేయాలని కోరే అంశంలోకి మేము తలదూర్చదల్చుకోలేదు. ఎందుకంటే అదొక అప్రజాస్వామిక వేదిక. అయినా ఉచితాలు వేరు, సంక్షేమ పథకాలు వేరు. వాటిని ఒకటిగా పరిగణించలేం. ’’ అని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.


ప్రత్యేక కమిటీ ప్రతిపాదన
ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషర్ మెహ్‌తా వాదనలు వినిపించారు. ‘‘రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో శాసనసభ ఒక చట్టాన్ని రూపొందించే వరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఏదైనా చేస్తే బాగుంటుంది. మేం (కేంద్ర ప్రభుత్వం) ఒక కమిటీని ప్రతిపాదిస్తున్నాం. బెనిఫిషియరీస్ (లబ్ధిదారులు), కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ, రాష్ట్రాల సెక్రటరీలు, రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు, నీతిఆయోగ్ ప్రతినిధి, ఆర్బీఐ, ఆర్థిక సంఘం, నేషనల్ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, పారిశ్రామిక రంగాలు లాంటి వివిధ వర్గాలకు చెందిన వారు ఆ కమిటీలో ఉంటారు.’’ అని సొలిసిటర్ జనరల్ అన్నారు.


సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఈ అంశంలో చాలా సంక్లిష్టాలు ఉన్నాయని అన్నారు. ‘‘ఇలా చాలా సంక్లిష్టమైన అంశం. మీ ముందు డేటా ఉండాలి. నాదగ్గర పని చేసే ఒక ఉద్యోగి ఉన్నారు. నిన్న ఆమె వద్ద మెట్రోలో ప్రయాణించడానికి కూడా డబ్బు లేదు. నేను ఆమెకు డబ్బులు ఇచ్చాను, ఆ తర్వాత తాను ఫ్రీ బస్సులో వెళ్తానని చెప్పింది. ఇది మహిళలకు ఫ్రీ. ఇది ఉచితమా?’’ అని కపిల్ సిబల్ ప్రశ్నించారు.


‘‘ఇది చాలా పెద్ద డిబేట్. దీనిపై దూరదృష్టితో లోతైన ఆలోచనలతో చర్చలు జరగాలి. వాటిని నా రిటైర్మెంట్ లోపు నా ముందు ఉంచండి. ఇది తీవ్రమైన అంశం. ఉచిత ప్రయోజనాలు పొందుతున్న వారు అవి కావాలని కోరుతుంటారు. ఇక మరికొందరు తాము పన్నులు చెల్లిస్తున్నామని, దీన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వాడాలని కోరుతుంటారు. కనుక రెండు వైపుల వారి అభిప్రాయాలను కమిటీ వినాలి’’ అని సీజేఐ అన్నారు. ఈ కేసును ఆగస్టు 17కి వాయిదా వేశారు.