Revolutionary Female Poets: 


రాసే కళ పురుషుల సొంతమా..? మేము రాయలేమా..? అంటూ తమ కలానికి పదును పెట్టిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. సాహిత్య రంగంలో విశేష సేవలు అందించారు. అప్పటి వరకూ ఉన్న కట్టుబాట్లను దాటుకుని, తమ ప్రత్యేకతేంటో ప్రపంచానికి చాటి చెప్పారు.భారత్‌లో ఇలాంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు. స్వాతంత్య్రోద్యమ సమయం నుంచే తమ రచనలతో ప్రజల్ని, ప్రత్యేకించి మహిళల్ని చైతన్య పరిచారు వీరంతా. 


1.తోరు దత్


ఇంగ్లీష్‌లో రచనలు చేసిన తొలి భారతీయ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు తోరు దత్. 1856లో రామ్‌బగన్‌లో జన్మించారు. ఫ్రెంచ్‌ భాషపై పట్టు సాధించిన ఆమె..1876లో "A Sheaf Gleaned in French Fields" అనే రచనతో ప్రాచుర్యం పొందారు. ఫ్రెంచ్‌ భాషలో నుంచి ఇంగ్లీష్‌లోకి 
కవిత్వాలను అనువదించేవారు. ఏ ఒక్క రచన కూడా అనువాదం అని తెలియకుండా రాయగలగటం ఆమె ప్రత్యేకత. తన రచనలతో ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన తోరు దత్ 21ఏళ్లకే మరణించారు. 


2.మహాదేవి వర్మ 


స్వాతంత్య్ర సమరయోధురాలిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగానే కాకుండా, ఉత్తమ రచయిత్రిగానే పేరు తెచ్చుకున్నారు మహాదేవి వర్మ. హిందీ సాహిత్యంలో చాయావాదాన్ని ప్రవేశపెట్టింది ఈమే. హిందీ సాహిత్యానికి రొమాంటిసిజాన్ని అద్దారు మహాదేవి వర్మ. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కారం అందుకున్న తొలి రచయిత్రిగా రికార్డు సృష్టించారు. 1979లో ఈ అవార్డు వరించింది. 1956లో పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. మహిళా సమస్యలపైనే ఎక్కువగా రచనలు చేసేవారు. ఆమె రచనలన్నింటినీ కలిపి ఎన్నో సంకలనాలు వెలువడ్డాయి. 


3.సరోజినీ నాయుడు 


నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న సరోజినీ నాయుడు, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తన సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. చిన్న వయసులోనే తండ్రి ప్రోత్సాహంతో రచనల వైపు అడుగు వేశారు సరోజినీ నాయుడు. మొట్టమొదటిసారే చాలా సుదీర్ఘమైన కవిత్వం రాశారు. ఆమె ప్రతిభను చూసి మెచ్చుకున్న అప్పటి నిజాం, స్కాలర్‌షిప్‌ ఇచ్చి మరీ తన స్కూల్‌లో చేర్పించారు. ఇంగ్లీష్‌లో రచనలు చేసినప్పటికీ...వాటిలో భారతీయత ఉట్టిపడేది. 1905లో "The Golden Threshold" రచన ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. 


4. కమలా సురయ్య 


ఫిమేల్ సెక్సువాలిటీ గురించి ఎంతో లోతైన రచనలు చేసిన వారిలో కమలా సురయ్య ఒకరు. కమలా దాస్‌ కలం పేరుతో ఆమె రచనలు చేసే వారు. " Summer In Calcutta", "The Descendants" రచనలు ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. 1984లో నోబెల్ పురస్కారానికీ షార్ట్‌లిస్ట్ అయ్యారు. "మదర్ ఆఫ్ మాడర్న్ ఇండియా పోయెట్రీ" అని ఆమెను పిలిచేవారు. 


5.అమృత ప్రీతమ్


తొలి పంజాబీ రచయిత్రిగా చరిత్రలో నిలిచిపోయారు అమృత ప్రీతమ్. 1956లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1969లో పద్మశ్రీ, 2004లో పద్మవిభూషణ్, అదే ఏడాది సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కారం వరించింది. భారత్-పాకిస్థాన్ విడిపోయినప్పటి స్థితిగతులపైనే ఆమె ఎక్కువ రచనలు చేశారు. 


Also Read: 75th Independence Day: తొలిసారి త్రివర్ణపతాకాన్ని ఎగరేసింది ఎక్కడో తెలుసా? ఆ రోజు నెహ్రూ ఏం మాట్లాడారు?