భారత దేశ 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కఢ్ గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్‌కఢ్‌తో ప్రమాణం చేయించారు. అంతకుముందు జగదీప్ ధన్‌కఢ్ బాపు స్మారకాన్ని సందర్శించారు. రాష్ట్రపతి భవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు జగదీప్ ధంఖర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.






జగ్‌దీప్ ధన్‌కఢ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్ నిబంధనల ప్రకారం కరోనా ప్రోటోకాల్ అనుసరించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అభ్యర్థిగా ధనఖర్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రత్యర్థి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై జరిగిన పోటీలో ధన్‌కఢ్ ఘనవిజయం సాధించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా, అందులో 710 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 15 ఓట్లు చెల్లవని ప్రకటించారు. జగదీప్ ధన్‌ఖర్‌కు 528 ఓట్లు రాగా, మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. తద్వారా మార్గరెట్ అల్వాపై ధన్‌కఢ్ భారీ తేడాతో విజయం సాధించారు.


జగదీప్ ధన్‌కఢ్ వాస్తవానికి రాజస్థాన్‌లోని జుంఝునులోని రైతు కుటుంబం నుండి వచ్చారు. తండ్రి గోకుల్ చంద్ర ధన్‌కఢ్ రైతు. ఆయనకు దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 1989లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. ధన్‌కఢ్ వృత్తిరీత్యా న్యాయవాది కూడా. న్యాయశాస్త్రం చదివిన తర్వాత న్యాయవాద వృత్తిని ప్రారంభించి 1990లో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా మారారు. హైకోర్టు నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు న్యాయవాద వృత్తిని చేపట్టారు. దేశంలోని ప్రసిద్ధ న్యాయవాదులలో ధన్‌కఢ్ ను ఒకరిగా పరిగణిస్తారు.


తొలిసారిగా జనతాదళ్‌ టికెట్‌పై జుంఝును నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 1993 నుంచి 98 వరకు ధన్‌కఢ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం ఆయనను 20 జూలై 2019న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.


ప్రొఫైల్



  • జగదీప్ ధన్​ఖడ్​ రాజస్థాన్‌లోని ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు.

  • చిత్తోడ్‌గఢ్‌ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

  • రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు.

  • రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. కిసాన్‌పుత్ర అనే గుర్తింపు సాధించారు.

  • ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు ధన్‌ఖడ్‌.

  • రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు.

  • రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు.