Kuno National Park:


చీతాలు మృతి 


మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాలు వరుసగా మృతి చెందాయి. నమీబియా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోయాయి. ఈ మరణాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మిగతా చీతాలను వెంటనే రాజస్థాన్‌కి తరలించాలని సూచించింది. సౌతాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల సంరక్షణపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పింది. గత వారమే రెండు చీతాలు చనిపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. 


"గత వారంలో మరో రెండు చీతాలు చనిపోయాయి. అయినా దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా ఎందుకు తీసుకుంటున్నారు. వాటి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోండి. ఈ చిరుతలను వేరు వేరుగా ఉంచకుండా అలా ఒకే చోట ఎందుకు ఉంచుతున్నారు. ఏడాది లోపే దాదాపు 40% చీతాలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది"


- సుప్రీంకోర్టు ధర్మాసనం


ఈ వ్యాఖ్యలు చేసే క్రమంలోనే జస్టిస్ గవాయ్ కీలక సూచనలు చేశారు. రాజస్థాన్‌లోని సాంక్చురీలో మిగిలిన చీతాలు ఉంచేందుకు అవకాశాలున్నాయేమో చూడాలని సూచించారు.  Jawai National Park ఆ చీతాలకు ఆవాసయోగ్యంగా ఉంటుందో లేదో పరిశీలించాలని చెప్పారు. ఉదయ్‌పూర్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల వరకూ విస్తరించింది ఉంది ఈ పార్క్.  


వరుస మరణాలు..


మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో గత నాలుగు నెలల్లో ఇలా చీతా చనిపోవడం ఇది 8వ సారి అని కునో నేషనల్ పార్కు అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నేషనల్ పార్కులో ఆఫ్రికన్ చిరుత సూరజ్ చనిపోయి కనిపించింది. ఈ చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. దీంతో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలలో మరణించిన వాటి సంఖ్య 8కి చేరిందని అధికారులు తెలిపారు. కునో పార్కులో తేజస్ అనే ఓ మగ చిరుత చనిపోయిన విషయం తెలిసిందే. మూడ్రోజులు కూడా తిరక్కముందే మరో చిరుత మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.చనిపోయిన తేజస్ చిరుత మెడపై మానిటరింగ్ టీమ్ గాయాలను గుర్తించింది. ఆ టీమ్ చిరుత తేజస్ కు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చికిత్స పొందుతూ మగ చిరుతపులి తేజస్ ప్రాణాలు విడిచింది. అంతకుముందు కొన్ని గంటలపాటు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. నమీబియా నుంచి భారత్ కు తరలించిన చిరుతపులలో తొలి చిరుత మార్చి 27న చనిపోయింది. నమీబియా నుంచి తరలించిన చిరుతల్లో ఒకటైన సాషా ఆడ చిరుత కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రాణాలు విడిచింది. నమీబియాలో ఉన్న సమయంలోనే సాషా అనారోగ్యంతో ఉందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మగ చిరుత ఉదయ్ ఏప్రిల్ 13న మరణించింది. కార్డియోపల్మోనరీ ఫెయిల్యూర్ కారణంగా ఉదయ్ అనే చిరుత చనిపోయినట్లు జూ సిబ్బంది వెల్లడించారు.


Also Read: సోనియా గాంధీ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా, ఎలా ఉన్నారంటూ పలకరింపు