Supreme Court Judges: సుప్రీం కోర్టులో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు చేరారు. ఈ ఐదుగురితో కలిసి మొత్తం 32 మంది జడ్జిలు కాగా.. మరో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ తో పాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ ఐదుగురు జడ్జిలతో ప్రమాణం చేయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య మొత్తం 32కి చేరుకుంది. ఇక ప్రస్తుతం రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. దేశ సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గతేడాది డిసెంబర్ 13వ ఈ ఐదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన విషయంలో ఈ సిఫార్సులకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గత శనివారం నోటిఫికేషన్ జారీ చేయగా... కాగా మిగిలిన రెండు ఖాళీలకు కూడా కొలీజియం గత నెల సిఫార్సులు పంపించింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చోబోతున్న రెండో తెలుగు వ్యక్తి


ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ పమిడిఘంటం నరసింహం తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చోబోతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్. సుధీర్ఘకాలం ఏపీ అడ్వకేట్ జనరల్ గా సేవలు అందించిన ఆయన తండ్రి పి. రామచంద్రా రెడ్డిది చిత్తూరు జిల్లా. జస్టిస్ సంజయ్ కుమార్ 1963 ఆగస్టు 14వ తేదీన హైదరాబాద్ లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ, దిల్లీ విశ్వ విద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. 2008 ఆగస్టు 8న అదనపు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. 2010 జనవరి 20వ తేదీన శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్ 14వ తేదీన పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపుర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదోన్నతి పొందారు.