Musharraf News: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. శాంతి కోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా ముషారఫ్ ను అభివర్ణించడంపై అధికార బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశ సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని శాంతి కోసం ప్రయత్నించిన వ్యక్తిగా ఎలా అభివర్ణిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి థరూర్ తిరిగి కౌంటర్ ఇవ్వడంతో వివాదం పెద్దది అయిపోయింది. భారత్ లో కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్. అయితే అరుదైన రుగ్మతతో బాధపడుతున్న ఆయన దుబాయ్ లో చికిత్సపొందుతూ ఆదివారం రోజు చనిపోయారు. ఆయమ మరణంపై శశి థరూర్ ట్వీట్ చేశారు.






"ఒకప్పుడు భారత దేశానికి శత్రువు. ఆయనే 2002-2007 మధ్య శాంతి స్థాపనకు నిజమైన శక్తిగా మారారు. ఆ రోజుల్లో ఆయన్ని ఏటా ఐరాసలో కలిసేవాడిని. వ్యూహాత్మక ఆలోచనలతో తెలివిగా, ఆకర్షణీయంగా, స్పష్టంగా కనిపించేవారు"  అంటూ ముషారఫ్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ థరూర్ ట్వీట్ చేశారు. దీనిపై అధికారం బీజేపీ తీవ్ర స్థాయిలో రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. "మన దేశంలోకి ఉగ్రవాదాన్ని చొప్పించి.. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా మన సైనికులను హింసించిన వ్యక్తిలో మీరు శాంతిని వెతుకుతున్నారా అని ప్రశ్నించారు.






దీనికి థరూర్ బదులు ఇస్తూ.. చనిపోయిన వ్యక్తి గురించి మాటలు మాట్లాడే భారత్ లో తాను పెరిగానన్నారు. ముషారఫ్ భారత్ కు శత్రువే. కార్గిల్ యుద్ధానికే బాధ్యుడే. కానీ 2002-2007 మధ్య తన స్వప్రయోజనాల కోసం భారత్ తో శాంతిని బలంగా కోరుకున్నారు. భారత్ కు మిత్రుడు కాకపోయినప్పటికీ.. మనలాగే శాంతిలోనే ఆయన తన వ్యూహాత్మక ప్రయోజనాలను వెతుక్కున్నారని థరూర్ ట్వీట్ చేశారు.