భారతీయ సినీ పరిశ్రమ మళ్లీ జోష్ పెంచింది. 2023 జనవరిలో విడుదలైన పలు తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, తమిళంలో ‘వారిసు’, ‘తునివు’, హిందీలో ‘పఠాన్’ కనీవినీ ఎరుగని రీతిలో హిట్స్ అందుకున్నాయి.


వీర సింహారెడ్డి


నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపి చంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘వీర సింహారెడ్డి’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్‌ గా నటించింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసి అదుర్స్ అనిపించింది.


వాల్తేరు వీరయ్య


బాబీ దర్వకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ  నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో చిరంజీవి వింటేజ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, పాటలు అన్నీ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమా కూడా రూ. 300 కోట్లకు పైనే కలెక్షన్లు సాధించింది. 


వారిసు (వారసుడు)


దళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సైతం రూ. 300 కోట్లు సాధించింది.


తునివు (తెగింపు)


కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ రూపొందించిన సినిమామే 'తునివు'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మంజూ వారియర్‌ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.   


పఠాన్


బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమా ‘పఠాన్’.  సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకోణె హీరోయిన్ గా నటించింది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. షారుఖ్ ఖాన్ 'పఠాన్'తో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఐదు రోజుల్లో ఈ సినిమా 500 కోట్లు కొల్లగొట్టింది. 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' సినిమాల రికార్డులు తుడిచి పెట్టింది.  ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.  మొత్తంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ 2023ను గ్రాండ్ గా మొదలుపెట్టింది.


Read Also: ఇండియన్ కంపోజర్‌కు ముచ్చటగా మూడో గ్రామీ అవార్డు - భారత్‌కు అంకితం ఇస్తున్నట్లు వెల్లడి!