భారతీయ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ 64వ గ్రామీ అవార్డు వేడుకలో సత్తా చాటారు. ఇప్పటికే రెండు గ్రామీ అవార్డులను అందుకున్న ఆయన, తాజాగా మరో అవార్డును దక్కించుకున్నారు. 2022 బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో రాక్, రోల్ లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ ల్యాండ్‌తో కలిసి రూపొందించిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్ కు ఈ అవార్డు దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సం వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పటికే  ఈ ఆల్బమ్ రోలింగ్ స్టోన్, బ్లూమ్‌ బెర్గ్, ది సండే గార్డియన్ సహా పలు వార్తల సంస్థలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.






ఇప్పటికే రెండు గ్రామీ అవార్డులు అందుకున్న రిక్కీ


రిక్కీ కేజ్ గతంలో బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీ కింద రెండు గ్రామీ అవార్డులను గెలుచుకున్నాడు. 2015లో తన ఆల్బమ్ ‘విండ్స్ ఆఫ్ సంసార’కు గాను ఆయన గ్రామీ అవార్డును అందుకున్నాడు.  2022లోనూ అతడిఆల్బమ్ ‘డివైన్ టైడ్స్’ గ్రామీ అవార్డును దక్కించుకుంది. బెంగుళూరుకు చెందిన రిక్కీ కేజ్-లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్ కలిసి ఈ ఆల్బమ్ ను రూపొందించారు.


గ్రామీ అవార్డు భారత్ కు అంకితం ఇస్తున్నా- రిక్కీ


ముచ్చటగా మూడోసారి ఈ అవార్డును అందుకోవడం పట్ల రిక్కీ సంతోషం వ్యక్తం చేశారు. “ఇప్పుడే నా 3వ గ్రామీ అవార్డును అందుకున్నాను. చాలా ధన్యాదాలు. నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఈ అవార్డును భారతదేశానికి అంకితం చేస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘డివైన్ టైడ్స్‌’లో తొమ్మిది పాటలు వీక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న పరిచయస్తులు తీసిన వీడియోలతో ఈ పాటలను రూపొందించినట్లు రిక్కీ వివరించారు. “మూడవ గ్రామీ అవార్డుకు నామినేట్ అయినందుకు చాలా థ్రిల్‌గా ఉంది. డివైన్ టైడ్స్ ఆల్బమ్ ఇప్పటి వరకు నా అత్యంత సృజనాత్మకమైన, విజయవంతమైన ఆల్బమ్స్ లో ఒకటి. దానికి వస్తున్న ప్రశంసలు నన్ను ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి. స్టీవర్ట్ కోప్‌ ల్యాండ్, నేను కలిసి ‘డివైన్ టైడ్స్‌’ని రూపొందించాం. మా సంగీతం ద్వారా  ప్రేక్షకులను అందమైన ప్రదేశాలకు, అంతకు మించి అద్భుతమైన భావోద్వేగాలకు తీసుకెళ్లినట్లు ఆశిస్తున్నాం. ‘బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్' కోసం పడిన కష్టం, దక్కుతున్న ఆదరణతో మర్చిపోయేలా చేసింది” అని వెల్లడించారు.    


పర్యవరణవేత్తగానూ రిక్కీ కేజ్ కు గుర్తింపు


రిక్కీ కేజ్ మ్యూజిక్ కంపోజర్ గానే కాకుండా పర్యావరణవేత్తగానూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  ఐక్యరాజ్య సమితి అతడిని గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది. తన ఆల్బమ్స్ లోనూ ప్రకృతి గురించి, ప్రకృతి జరుగుతున్న ముప్పు గురించి ఆయన వివరించారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అంటారు రిక్కీ కేజ్.


Read Also: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ డైరెక్టర్ సుధ కొంగర, డాక్టర్లు ఏం చెప్పారంటే?