ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది. తమిళ హిట్ మూవీ ‘సూరరై పొట్రు’ను అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తోంది. ఈ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆమె చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. చెయ్యి విరగడంతో పాటు ఎముక పక్కకు తొలగినట్లు తెలుస్తోంది. సినిమా యూనిట్ వెంటనే ఆమెను షూటింగ్ స్పాట్ నుంచి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమె చేతి ఎముకలను సరిచేసి కట్టు కట్టారు. ట్రీట్మెంట్ అనంతరం ఆమెను ఇంటికి పంపించారు. అయితే, నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. చేతిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో సుధా నెల రోజుల పాటు ఇంటికే పరిమితం కానుంది.
గాయం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సుధ
తాజాగా తన చేతి గాయానికి సంబంధించిన ఫోటోలను సుధ సోషల్ మీడియాలో షేర్ చేసింది. “నొప్పి ఎక్కువగా ఉంది. నెల రోజులు ఈ ఇబ్బంది తప్పదు. అయిన సూపర్ గా ఉంది” అన్నట్లుగా రాసుకొచ్చింది. ఈ గాయం మానేందుకు సుమారు నెల రోజుల సమయం పడుతుందని వివరించింది. డాక్టర్ల సూచనలన మేరకు తగు జాగ్రతలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది.
అద్భుత విజయాన్ని అందుకున్న ‘ఆకాశం నీ హద్దురా’
సుధా కొంగర తెర కెక్కించిన పలు సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. విభిన్నమైన దర్శకత్వ ప్రతిభతో సుధా పలు అవార్డులు అందుకున్నది. ఆమెతో సినిమాలు చేయడానికి ప్రముఖ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత గోపీనాథ్ జీవిత ఆధారంగా తీసిన ‘ఆకాశం నీ హద్దురా’( తమిళంలో ‘సూరరై పొట్రు’) కనీవినీ ఎరుగని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఆమె కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. సూర్య నటించిన ఈ సినిమాకు పలు జాతీయ అవార్డులు దక్కాయి.
వరుస సినిమాలతో సుధ బిజీ బిజీ
ప్రస్తుతం ‘సూరరై పొట్రు’ సినిమాను సుధా హిందీలో రీమేక్ చేస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. ఈ దశలోనే సుధా కొంగరకు గాయం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. అటు సూర్య, సుధ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ లోనూ సుధ, వెంకటేష్ హీరోగా ‘గురు’ అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వీరిద్దరు త్వరలో మరో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సుధ పలు కథలు కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: సీనియర్ నటి భానుప్రియకు మెమరీ లాస్ - సెట్‌లో డైలాగులు చెప్పలేకపోతున్నా అంటూ ఆవేదన!