Delhi CM Kejriwal Got Bail: ఢిల్లీ లిక్కర్ కేసుకు (Delhi Liquor Case) సంబంధించి సీఎం కేజ్రీవాల్‌కు (CM Kejriwal) భారీ ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఇచ్చింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని స్పష్టం చేసింది. దీంతో 6 నెలల పాటు తీహార్ జైలులో ఉన్న ఆయన విడుదల కానున్నారు. అటు, సుప్రీం తీర్పుపై ఆప్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జైలు బయట మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కాగా, మద్యం పాలసీకి సంబంధించి గతంలో ఈడీ కేసులో బెయిల్ రాగా.. సీబీఐ కేసులో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా.. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది.
ఇవీ షరతులు
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడం సహా.. బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. వీటిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో బెయిల్ ఇచ్చింది. కేసు గురించి క్కడా బహిరంగ వ్యాఖ్యలు చెయ్యొద్దని స్పష్టం చేసింది. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని.. ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు సైతం చెయ్యొద్దని పేర్కొంది. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది.
'సుప్రీం' కీలక వ్యాఖ్యలు
సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తుల హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సరైందే అయినా.. చేసిన సమయం మాత్రం సరిగా లేదని అభిప్రాయపడింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సమంజసం కాదని పేర్కొంది. ప్రతి వ్యక్తికీ 'బెయిల్ అనేది నిబంధన.. జైలు మినహాయింపు'గా ఉండాలని మరోసారి వెల్లడించింది.
ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే.?
- మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.
- అనంతరం లోక్ సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.
- గడువు ముగిసిన అనంతరం జూన్ 2న లొంగిపోయిన సీఎం
- జూన్ 20న సాధారణ బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు
- ఈడీ అభ్యంతరంతో బెయిల్ నిలిపేసిన ఢిల్లీ హైకోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు
- ఈడీ కేసులో బెయిల్ అనంతరం అరెస్ట్ చేసిన సీబీఐ
- జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్. తాజాగా బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.
Also Read: PMJAY : సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ సేవలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు?