Onam Festival 2024: బంగారు రంగు అంచుతో కూడిన స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు..ఎటు చూసినా పూలతో నిండిన లోగిళ్లు...రంగు రంగు పూలతో తీర్చిదిద్దిన రంగవల్లులు...మొదటి రోజు ఆతమ్ - చివరి రోజు ఓనమ్...మొత్తం 10 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే పండుగ ఓనమ్


తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి ఎంత ముఖ్యమో...కేరళ వాసులకు ఓనమ్ అంత ప్రత్యేకమైనది. మలయాళీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ఓనం పండుగకు 1961 లో  జాతీయ పండగగా గుర్తింపు లభించింది. ఈ ఏడాది సెప్టెంబరు 06 న మొదలైంది.. సెప్టెంబరు 15 ఆఖరి రోజు.  


రాక్షస రాజు అయిన బలిచక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ పది రోజుల పాటూ జరుపుకునే పండుగ ఇది. మహాబలి పరిపాలించిన సమయం మలయాళీలకు స్వర్ణయుగం లాంటిది..అందుకే తమ మహారాజు అంటే మలయాళీలకు అత్యంత గౌరవం. బలి పరిపాలనా కాలంలో ప్రజలంతా     సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే మహారాజుకి రంగురంగుల పూలతో ఘనంగా స్వాగతం పలుకుతారు. ఈ పండుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు. 


Also Read: సోషల్ మీడియాలో ఓనమ్ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి


ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి  


భక్త ప్రహ్లాదుడు..శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడు...హిరణ్య కశిపుడి తనయుడు. తండ్రిని నచ్చని శ్రీహరిని పూజించి ...అనుక్షణం అదే ధ్యాసలో ఉండి తండ్రి ఆగ్రహానికి గురవుతాడు. చివరకు ఆ శ్రీహరిని రమ్మని ప్రహ్లాదుడు కోరడంతో సంధ్యాసమయంలో స్తంభంలోంచి ఉద్భవించిన నారసింహుడు హిరణ్య కశిపుడిని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుడిని అనుగ్రహిస్తాడు. ఆ ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి. తాత ప్రహ్లాదుడి ఒడిలో పెరిగిన బలిచక్రవర్తి..సకల విద్యలు నేర్చుకున్నాడు. మహారాజుగా పట్టాభిషేకం జరిగిన తర్వాత విశ్వజిత్ యాగం చేసి ఇంద్రలోకాన్ని ఆక్రమించేందుకు దండెత్తుతాడు. స్వర్గంపై దండెత్తిన బలి చక్రవర్తిని ఎలా ఆపాలో అర్థంకాక..శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. దశావతారాల్లో భాగంగా తాను స్వయంగా అదితి అనే రుషిపత్ని ఇంట జన్మిస్తానని..బలి అహంకారాన్ని తొక్కేస్తానని చెప్పాడు విష్ణువు. ఆ తర్వాత బలి యాగం తలపెట్టడం..విష్ణువు వామనుడిగా అక్కడకు వెళ్లడం..ఏం కావాలో కోరుకోమని బలి కోరడంతో మూడు అడుగులు అడుగుతాడు వామనుడు. అలా భూమి, ఆకాశంపై రెండు అడుగులు వేసి..మూడో అడుగు బలి తలపై వేసి పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి చక్రవర్తి దాన గుణానికి మెచ్చి ఏడాదికోసారి భూమ్మీదకు వచ్చి నీ రాజ్యాన్ని చూసుకోమని వరమిస్తాడు. అలా బలి చక్రవర్తి ఏడాదిలో భూమ్మీదకు వచ్చే రోజే ఓనం. అందుకే మలయాళీలకు ఇదే పెద్ద పండుగ.  


Also Read: మూడు అడుగులతో ముల్లోకాలను చుట్టేసిన త్రివిక్రముడి జయంతి!


రాక్షస రాజుకి ఘన స్వాగతం


బలి చక్రవర్తికి ఘనంగా స్వాగతం పలుకుతూ రంగు రంగు పూలతో ముగ్గులు వేస్తారు. తిరు ఓనం రోజు మహాబలి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ప్రజల ఆనందాన్ని కళ్లారా చూస్తాడని అక్కడి వారి విశ్వాసం. ఓనం పండుగలో అలంకరణ ఎంత అద్భుతమో...విందు భోజనం అంతకు మించి ఉంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే పడవల పందేలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి.