Supreme Court: జడ్జీల బదిలీలు, నియామకాల కోసం హైకోర్టు సిఫార్సులను కొలీజియంకు పంపకుండా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ హైకోర్టులు గత 10 నెలలుగా 80 మంది జడ్జీల బదిలీలు, నియామకాల కోసం కొలీజియంకు పంపిన సిఫార్సుల్ని తొక్కిపెట్టడంపై సీరియస్ అయింది. కేంద్రం జాప్యంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది.


కేంద్రంపై ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్


కొలీజియం సూచనలను క్లియర్ చేయడానికి కోర్టు నిర్దేశించిన సమయపాలనను పాటించనందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగళూరుకు చెందిన అడ్వొకేట్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ఎన్జీవో కామన్ కాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ కూడా జోడించారు. ఎన్జీవో కామన్ కాజ్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. నియామకాల్లో జాప్యం కారణంగా చాలా మందిద న్యాయవాదులు న్యాయమూర్తి పదవికి తమ సమ్మతిని ఉపసంహరించుకున్నారని చెప్పారు. 


హైకోర్టులు సిఫార్సు చేసిన జడ్జీల పేర్లను కొలీజియంకు పంపకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. 10 నెలలుగా 80 మంది పేర్లను పెండింగ్ లో ఉంచారు. ఇందులో కేవలం ప్రాథమిక ప్రక్రియ మాత్రమే జరిగింది. కొలీజియం నిర్ణయం తీసుకునేలా మీ అభిప్రాయం తెలుసుకోవాలంటూ జస్టిస్ కౌల్ కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


ఏజీకి 2 వారాల సమయం ఇచ్చిన సుప్రీం కోర్టు


26 మంది జడ్జీల బదిలీలు, ఓ సున్నితమైన హైకోర్టులో చీఫ్ జస్టిస్ నియామకం పెండింగ్ లో ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. హైకోర్టు సిఫార్సు చేసిన తర్వాత కొలీజియంకు పంపని పేర్లు ఎన్ని ఉన్నాయో తమ వద్ద పూర్తి సమాచారం ఉందని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ కౌల్ అన్నారు. ఈ అంశంపై స్పందించేందుకు వారం సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి గడువు కోరారు. దీంతో బెంచ్ ఆయనకు రెండు వారాల సమయం ఇచ్చింది. అలాగే కేంద్రం వాదనతో తిరిగి రావాలని కూడా ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణ అక్టోబర్ 9వ తేదీకి వాయిదా పడింది.


కేంద్రం చేస్తున్న జాప్యంపై సుప్రీం తీవ్ర అసహనం


కేంద్రం జాప్యంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను చెప్పాల్సింది ఎంతో ఉందని, కానీ ఇక్కడితో ఆపేస్తున్నానని వ్యాఖ్యానించారు. అటార్నీ జనరల్ స్పందించడానికి ఒక వారం గడువు కోరడం వల్ల తాను మౌనంగా ఉంటున్నానని, తదుపరి విచారణలో మాత్రం తాను నిశ్శబ్ధంగా ఉండబోనని అన్నారు. న్యాయమూర్తుల నియామకం అనేది సుప్రీం కోర్టు, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య వివాదంలో కీలకమైన అంశంగా మారినట్లు తెలిపారు. 


న్యాయమూర్తుల ఎంపికలో ప్రభుత్వ పాత్ర ఉండాలని కేంద్ర మంత్రులు వాదిస్తున్నారు. కానీ న్యాయమూర్తుల నియామకాల్లో కేంద్రానికి హక్కు కల్పించే జాతీయ న్యాయ నియామకాల చట్టాన్ని అక్టోబర్ 2015లో సుప్రీం కోర్టు కొట్టివేసింది.