దేశ రాజధాని దిల్లీలో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని జంగ్‌పురాలో భోగల్ ప్రాంతంలో ఉమ్రావ్ జువెలర్స్ షోరూంలో దొంగలు పడి నగలు ఎత్తుకుపోయారు. సెప్టెంబరు 25 రాత్రి ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు ఏకంగా స్ట్రాంగ్ రూం కి కన్నం పెట్టి రూ.25 కోట్ల విలువైన నగలతో పారిపోయారు. నాలుగు అంతస్థుల ఉన్న భవనం టెర్రస్‌పై నుంచి దొంగలు షోరూంలోకి చొరబడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో స్ట్రాంగ్ రూం ఉండగా అక్కడికి చేరుకుని దానికి రంద్రం చేసి అందులోని నగలను కూడా కాజేశారు. సీసీటీవీలను డిస్‌కనెక్ట్ చేసి మరీ పక్కా ప్లాన్‌తో దొంగలు భారీ చోరీకి తెగబడ్డారు.
స్ట్రాంగ్ రూమ్‌కు మిషన్ల సాయంతో రంద్రం చేసి అందులోని నగలను తీసుకున్నారు. అలాగే షోరూంలో డిస్‌ప్లే కోసం ఉంచిన వాటిని కూడా అన్నీ దోచుకుని పరారయ్యారు. షోరూం యజమాని షాపును ఆదివారం రాత్రి మూసేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. అయితే సోమవారం షాపు తెరవలేదు. ఈరోజు ఉదయం షాపు తెరిచి చూసేసరికి దొంగతనం జరిగి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బంగారు, వజ్రాభరణాలు అన్నీ కలిపి మొత్తం రూ.25కోట్ల విలువైన నగలు దొంగలు దోచుకెళ్లినట్లు యజమాని పోలీసులకు తెలిపారు.
దొంగలు సీసీటీవీలన డిస్‌కనెక్ట్ చేయకముందు రికార్డైన వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. పోలీస్ అధికారులు షోరూం మొత్తం పరిశీలించి డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. షోరూం చుట్టు పక్కల ఉన్న సీసీటీవీలతో పాటు ఆ వీధిలోని సీసీటీవీలను పోలీసులను పరిశీలిస్తున్నారు. షోరూంలో అలారం కూడా ఉన్నప్పటికీ ఇంత పెద్ద దోపిడీ జరిగినా అలారం మోగకపోవడంపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు.
సోమవారం హర్యానాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అంబాలా ప్రాంతంలోని ఓ కార్పొరేటివ్ బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులో ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. బ్యాంకు గోడకు డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో రంధ్రం చేసి లోపలికి వెళ్లారు. తర్వాత గ్యాస్ కట్టర్‌తో దాదాపు 32 లాకర్లను తెరిచి బంగారం దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. వారాంతం కావడం వల్ల బ్యాంక మూసి ఉంది. సోమవారం ఉదయం బ్యాంకు అధికారులు వచ్చి బ్యాంకును తెరిచి చూసే సరికి దొంగతనం జరిగినట్లు తెలిసింది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.