మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం పదవిలో కొనసాగుతానో తెలియదన్నారు. పుణెలోని బారామతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్థిస్తున్నానన్నారు. అయితే రేపు ఆ స్థానంలో ఉంటానో ? లేదో ? మాత్రం కచ్చితంగా చెప్పలేనన్నారు. అజిత్ పవార్ వ్యాఖ్యలు చూస్తుంటే...మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీసీ పొత్తు ఎక్కువ కాలం కొనసాగేలా లేదని అర్థమవుతోంది. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా ముంబైలో పర్యటించారు. ఈ సమావేశానికి అజిత్ పవార్ హాజరుకాలేదు. ముందు నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా వెళ్లలేకపోయినట్లు తెలిపారు.  ఎన్నికలయ్యాక నాలుగుసార్లు ప్రమాణ స్వీకారాలు జరగ్గా మూడుసార్లు అజిత్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


ఎన్సీపీలో కీలక నేతగా ఎదిగిన అజిత్‌ పవార్‌.. జాతీయ రాజకీయాల్లో ఆరితేరిన శరద్‌ పవార్‌ వద్ద పలుసార్లు ధిక్కార స్వరాన్ని వినిపించారు. 2004లో తమ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ సీఎం పదవిని కాంగ్రెస్‌కు ఇవ్వడాన్ని అజిత్‌ బహిరంగంగా వ్యతిరేకించారు. అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చిన్నాన్నతో విభేదించి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, కొన్ని గంటలకే ఆ ప్రభుత్వం కుప్పకూలడంతో మళ్లీ ఆయన వద్దకే చేరుకున్నారు. జులైలో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే, ఎన్సీపీ ముక్కలైంది. అజిత్‌ పవారే పార్టీని చీల్చారు. ఆ వెంటనే ప్రభుత్వంలో చేరిపోయారు. ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్‌ పవార్‌ ప్రభుత్వంలో చేరడంతో జితేంద్ర అవధ్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నియమించింది. 


అజిత్‌ పవార్‌ శరద్‌ పవార్‌ పెద్దన్న అనంత్‌ రావు కుమారుడు. 20 ఏళ్ల వయసులోనే చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అదే ఏడాది బారామతి నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ.. శరద్‌ పవార్‌ కోసం దాన్ని త్యాగం చేశారు. దీంతో అదే స్థానం నుంచి గెలుపొందిన శరద్‌ పవార్‌.. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసేందుకు దోహదం చేసింది. 1991లో అసెంబ్లీలో అడుగుపెట్టిన అజిత్‌ పవార్, ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


సుప్రియా రాకతో


తొలుత కాంగ్రెస్‌లో ఉన్న శరద్‌ పవార్‌.. కొత్తగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన తర్వాత కూడా ఆయన బాటలోనే అజిత్‌ నడిచారు. కాంగ్రెస్‌- ఎన్సీపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వాల్లో నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, ఆర్థికం వంటి కీలక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. శరద్‌ పవార్‌కు వారసుడిగా ఎదుగుతోన్న క్రమంలోనే అధినేత కుమార్తె సుప్రియా సూలే రాజకీయ ప్రవేశం చేయడంతో అజిత్‌ ఆధిపత్యానికి చెక్ పడింది. శరద్‌ పవార్‌ మనుమడు రోహిత్‌ కూడా పార్టీలోకి రావడం అజిత్‌ జీర్ణించుకోలేకపోయారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డారన్న కేసులు అజిత్ పవార్ కు ఇబ్బందికరంగా మారాయి.