భారత్‌, కెనడాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల అంశంపై శ్రీలంక భారత్‌కు మద్దతుగా మాట్లాడింది. కెనడా  ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా , స్వర్గధామంగా మారిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే పేర్కొన్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌పై చేస్తున్న ఆరోపణలు దౌర్జన్యపూరితమైనవని, ఆధారాలు లేనివని ఆయన తెలిపారు. జస్టిన్ ట్రూడో అబద్ధాలు చెప్తున్నారని సబ్రే వెల్లడించారు. గతంలో శ్రీలంకలో మారణహోమం జరిగిందని కెనడా తప్పుడు ఆరోపణలు చేసిందని, అలాగే  ఇప్పుడు కూడా చేస్తోందని అన్నారు. ట్రూడో మాటలు తననేమీ ఆశ్బర్యపరచలేదని సబ్రే అన్నారు.


కొందరు తీవ్రవాదులు కెనడాలో సురక్షిత స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని సబ్రే అన్నారు. కెనడా ప్రధాని ఎలాంటి రుజువులు చూపించకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం, శ్రీలంక గురించి ఆధారాలు లేకుండా అబద్ధాలు మాట్లాడినట్లుగానే ఉందని తెలిపారు. తమ దేశంలో ఎలాంటి మారణహోమం జరగలేదని అందరికీ తెలుసు అని ఆయన ఏఎన్‌ఐ వార్తా సంస్థతో వెల్లడించారు. ఇటీవల కెనడా పార్లమెంటులో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల కోసం పనిచేసిన సైనికుడిని గౌరవించడంపై శ్రీలంక మంత్రి సబ్రే స్పందించారు. నాజీల తరఫున పోరాడిని వ్యక్తికి ట్రూడో ఘన స్వాగతం పలికాడని విమర్శలు చేశారు. ట్రూడో గతంలో కూడా ఇలాగే ప్రవర్తించాడని, ఏదీ సరిగ్గా తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తారని సబ్రే దుయ్యబట్టారు. కాబట్టి భారత్‌పై చేసే ఆరోపణలు కూడా అలాగే ఉన్నాయని అన్నారు. 


కెనడా విషయంలో భారతదేశం ప్రవర్తిస్తున్న దృఢమైన వైఖరిని శ్రీలంక సమర్థిస్తోందని భారత్‌లోని శ్రీలంక హైకమిషనర్ మిలిందా మోరగోడా వెల్లడించారు. భారత్‌కు ఈ విషయంలో శ్రీలంక మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదం కారణంగా శ్రీలంక ప్రజలు చాలా నష్టపోయారని, తమ దేశం ఉగ్రవాదాన్ని సహించలేదని పేర్కొన్నారు. గత ఎన్నో ఏళ్లుగా శ్రీలంకలో మేము వివిధ రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నామని, చాలా మంది స్నేహితులను, సహచరులను కోల్పోయానని వెల్లడించారు.


ఈ ఏడాది జూన్‌లో కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా, భారత్‌ల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారతీయ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని తమకు విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ ఆరోపించారు. దీనిపై భారత్‌ మండిపడింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని భారత్‌ ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు రాయబారులను బహిష్కరించాయి. కెనడా పౌరులకు వీసాల జారీని కూడా భారత ప్రభుత్వం నిలిపేసింది. కెనడా ఇప్పటికీ ప్రభుత్వం తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు.  ఇదిలా ఉండగా ఇటీవల కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌ దల్లా గ్యాంగ్‌లో మరోకరి హత్య జరిగింది. సుఖ్‌దోల్‌ సింగ్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ను కెనడాలో ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోంది.