అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఈనెల 10న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. తల్లిదండ్రులే హంతకులని తేల్చారు. కన్నబిడ్డను సుపారీ ఇచ్చి  మరీ చంపించారని నిర్ధారించారు. పరారీలో ఉన్న పేరంట్స్‌ను వెతికి పట్టుకున్నారు. కడుపున పుట్టిన బిడ్డ.. కన్నవారే ఎందుకు హతమార్చారు..? దీని వెనకున్న స్టోరీ  ఏంటన్నది.. పోలీసులు వివరించారు.


తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన తనయుడు తలనొప్పిగా తయారయ్యాడు. తాగుడుకు బానిసై.. ఇల్లువాకిలి పట్టకుండా తిరిగాడు. కుటుంబాన్ని గాలికి వదిలేసి... మత్తులో  తేలిపోయాడు. తాగేందుకు డబ్బు కోసం... తల్లిదండ్రులను వేధించాడు. వారికి తలదాచుకునేందుకు చోటు కూడా లేకుండా చేద్దామనుకున్నాడు. ఉన్న ఒక్క ఇల్లు  అమ్మేయాలని... కన్నవారితో కొట్లాడాడు. వారికి నిత్యం నరకం చూపించాడు. కొడుకు వేధింపులు భరించలేని తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవించారు. ఎంతకీ అతడి  ప్రవర్తన మారకపోగా.. రోజురోజుకూ దిగజారిపోయాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయారు తల్లిదండ్రులు. కొడుకు పెట్టే వేధింపులు భరించేకంటే.. కడుపుకోతే మేలనుకున్నారు. 
ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుని... హత్యకు ప్లాన్‌ చేశారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక  మండలంలో జరిగింది. 


పగిల్ల రాము-సావిత్రి దంపతులు భద్రాచలం మెడికల్‌ కాలనీలో ఉంటున్నారు. వీరికి 35ఏళ్ల కుమారుడు దుర్గాప్రసాద్‌ ఉన్నాడు. కొడుకు చేతికి అందొచ్చాడే గానీ... చేతగాని  వాడు. మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి... రోజూ ఇంట్లో గొడవపడేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన భార్య మౌనిక... పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. దీంతో  ఇంకొంచెం ఎక్కువగా తాగడం మొదలుపెట్టాడు దుర్గప్రసాద్‌. తాగొచ్చి... ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను హింసించేవాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. చివరికి  ఉన్న ఇంటిని అమ్మేయాలని ఒత్తిడి చేశాడు. అందుకోసం రోజూ తల్లిదండ్రులను వేపుకుతిన్నాడు. చాలా రోజులు వేధింపులు భరించిన వాళ్లు... ఇక తెగించేశాడు. ఇలాంటి  కొడుకు ఇక వద్దని నిర్ణయించుకున్నాడు. ఊపిరిపోసిన వారే ఊపిరి తీయాలనుకున్నారు. కొడుకును హత్య చేయించేందుకు సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించారు. భద్రాచలానికే  చెందిన గుమ్మడి రాజు, షేక్‌ ఆలీ పాషాకి 3లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు. తమ కుమారుడు దుర్గాప్రసాద్‌ను చంపేయాలని ఒప్పందం చేసుకున్నారు. ప్లాన్‌ ప్రకారం...  ఈనెల 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్‌ను హత్య చేశారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తల్లిదండ్రులు కూడా కత్తితో దుర్గాప్రసాద్‌ గొంతు కోసేశారు. అతను చనిపోయిన  తర్వాత... మృతదేహాన్ని ఆటోలో తుమ్మలనగర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చెట్ల మధ్యలో మృతదేహాన్ని పడేసి... పెట్రోలు పోసి తగలబెట్టేశారు. ఆ తర్వాత  తల్లిదండ్రులు, సుపారీ గ్యాంగ్‌లోని ఇద్దరు ఊరు వదిలి వెళ్లిపోయారు.


ఈనెల 10వ తేదీ  మధ్యాహ్నం అటవీ ప్రాంతానికి పుల్లల కోసం వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన మృతదేహాన్ని చూసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అక్కడికి వెళ్లి చూసిన ఎటపాక  పోలీసులు... హత్యగా అనుమానించారు. అతను ఎవరనే వివరాలు ఆరా తీశారు. మృతదేహం ఫొటోతో పాంప్లెట్లు వేయించి.. అన్ని చోట్ల అంటించారు. దుర్గాప్రసాద్‌ భార్య  మౌనిక.. మృతదేహాన్ని గుర్తుపట్టింది. చనిపోయింది తన భర్తే అని నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించింది. మృతుడి వివరాలు తెలియడంతో... పోలీసులు కూపీ లాగారు.  అసలు ఏం జరిగింది..? అనే కోణంలో దర్యాప్తు చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు... దుర్గాప్రసాద్‌ తల్లిదండ్రులు చేసిన దారుణం బయటపడింది. సుపారీ ఇచ్చి మరీ...  కన్నబిడ్డను చంపించిన పేరంట్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌ను కూడా పట్టుకున్నారు.