Sri Sri Ravi Shanker: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణ ప్రతికూలత కారణంగా బుధవారం (జనవరి 25న) ఉదయం ఈరోడ్ జిల్లాలోని సత్య మంగళం టైగర్ రిజర్వ్ (ఎస్టీఆర్)లోని గిరిజన స్థావరం ఉకినియం వద్ద కిందకు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. రవిశంకర్‌తో పాటు హెలికాప్టర్‌లో ఉన్న మరో నలుగురు క్షేమంగా ఉన్నట్లు కడంబూరు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే తాము ఘటనా స్థలానికి వెళ్లామని.. హెలికాప్టర్ లో ఉన్న వాళ్లంతా క్షేమంగా కిందకు దిగారని పోలీసులు వివరించారు.
శ్రీశ్రీ రవిశంకర్ మరో నలుగురితో కలిసి ప్రైవేట్ హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి తిరుప్పూర్ వెళ్తున్నారు. విపరీతమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సుమారు 11:30 గంటలకు, 50 నిమిషాల నిరీక్షణ తర్వాత వాతావరణం అనుకూలించడంతో ఆ హెలికాప్టర్ తిరిగి బయలుదేరింది.
పోలీసులు ఏం చెప్పారు?
కదంబూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సి వడివేల్ కుమార్ మాట్లాడుతూ.. "ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్ ఎస్టీఆర్ మీదుగా వెళ్తున్నప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్ ముందుకు వెళ్లలేక.. పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశాడు" అని చెప్పారు. అయితే ఎవరికీ ప్రమాదం జరగలేదని, అంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.