గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్‌ దేశంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఇప్పుడా డాక్యుమెంటరీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. దీనిప కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై ఆ పార్టీ నేతల కినుకు వహించారు.పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడిది సంచలనంగా మారింది. 


గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ. ఈ విషయంలో కాంగ్రెస్‌ చేపట్టే చర్యలను తప్పుపడుతూ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భారత సంస్థల అభిప్రాయం కంటే బ్రిటిష్ బ్రాడ్ కాస్టర్ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని అనిల్ ఆంటోనీ గతంలో అన్నారు.


'@incindia @INCKerala నా పదవులకు రాజీనామా చేశాను' అని అనిల్ తన రాజీనామా లేఖ కాపీని పార్టీ నాయకత్వానికి షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ బీబీసీ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్లతో పాటు మోదీ గురించి ప్రస్తావించారు.






అనిల్ ఆంటోనీ తన రాజీనామా లేఖలో ఏం రాశారు?


నిన్నటి సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్‌లో నా బాధ్యతలన్నీ వదులుకోవడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా కేరళ రాష్ట్ర నాయకత్వానికి, డాక్టర్ శశి థరూర్‌కు ధన్యవాదాలు తెలిపారు.


పార్టీకి అనేక విధాలుగా సమర్థవంతంగా తోడ్పడే తనకంటూ ప్రత్యేక బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు అనిల్‌ ఆంటోనీ. మీరు, మీ సహోద్యోగులు, నాయకత్వం మీ చుట్టూ ఉన్న మీ ఆదేశానుసారం వ్యవహరించే చెంచా గుంపుతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని బాగా తెలుసు. అది మాత్రమే మెరిట్‌కు ప్రమాణంగా మారింది. దురదృష్టవశాత్తూ, మాకు అందులో ప్రవేశం లేదు." అని రాసుకొచ్చారు. 


డాక్యుమెంటరీ గురించి అనిల్ ఏమన్నారంటే.


బీజేపీతో విభేదాలు ఉన్నప్పటికీ, భారతీయ సంస్థల కంటే బీబీసీ, యూకే మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్ స్ట్రా అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమైన ధోరణి అని అనిల్ అన్నారు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. బీబీసీ ప్రభుత్వ ప్రాయోజిత ఛానల్ అని, భారత్ పట్ల పక్షపాతంతో వ్యవహరించిన చరిత్ర ఉందని అనిల్ ఆంటోనీ ట్వీట్ చేశారు. ఇరాక్ యుద్ధానికి ప్రణాళిక రచించింది జాక్ స్ట్రా అని ఆయన అన్నారు. 2003లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్ పై దాడి చేశాయ.


అనిల్ ఆంటోనీ ఇటీవలి వరకు కాంగ్రెస్ కేరళ విభాగం డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని వివిధ రాష్ట్ర కాంగ్రెస్ శాఖలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లర్ల సమయంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.