BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీపై వివాదం ఇప్పుడు హింసాత్మక మలుపు తీసుకుంది. కేరళలోని కొన్ని కళాశాలల్లో మంగళవారం రోజు ప్రధాని మోదీపై బీసీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. వీరికి తోడుగా యువ మోర్చా కూడా రాష్ట్రంలో ర్యాలీ చేపట్టింది. వీటిని ఆపేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ వారు వినలేదు. పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి జలఫిరంగులతో బీజేపీ శ్రేణులను అడ్డుకోవాలని సూచించారు. వెంటనే పోలీసు బలగాలు రంగంలోకి దిగి వాటర్ కెనాన్లతో బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. 


డీవైఎఫ్ఐఆధ్వర్యంలో డాక్యుమెంటరీ ప్రదర్శన


కళాశాల్లో బీబీసీ డాక్యుమెంటరీని సీపీఐ(ఎం) యూత్ వింగ్ డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) ప్రదర్శించింది. బీజేపీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. కాషాయ దళ కార్యకర్తలు.. డాక్యుమెంటరీ ప్రదర్శన జరుగుతున్న చోటుకు వెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకోగా.. బీజేపీ శ్రేణులు బారికేడ్లు తొలగించి మరీ చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వాటర్ కెనాన్లతో వారిని అడ్డుకున్నారు. బయట ఇంత గొడవ జరుతుండగానే.. కళాశాల లోపల డాక్యుమెంటరీ ప్రదర్శన సాగింది. 


కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ ప్రదర్శన


పాలక్కాడ్, వయనాడ్ జిల్లాల్లో ఇలాంటి నిరసనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. యూత్ కాంగ్రెస్ జనవరి 26వ తేదీన డాక్యుమెంటరీని చూపించాలని నిర్ణయించింది. అంటే గణతంత్ర దినోత్సవం రోజే ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించబోతుండగా... యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కె. ఆంటోనీ (సీనియర్ నాయకుడు ఎకె ఆంటోనీ మద్దతు ఇచ్చాడు. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. 


గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ రూపకల్పన


59 నిమిషాల నిడివి కల్గిన ఈ డాక్యుమెంటరీపై దేశ వ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది. 2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన విషయాలు, అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి వివరిస్తూ.. బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా మోదీ ఉండడం.. అల్లర్లలో వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి వాళ్లే కారణం అన్నట్లుగా చూపించడంతో అసలు సమస్య మొదలైంది. ఈ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ ను జనవరి 17వ తేదీన బ్రిటన్ లో ప్రసారం చేశారు. ఇందులో మోదీ రాజకీయాల అంశాలను ప్రస్తావించారు. ఇందులో మోదీకి వ్యతిరేకంగా చాలా విషయాల గురించి వివరించారు. ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ డాక్యుమెంటరీని దుష్ప్రచారంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అభివర్ణించారు. ఈ డాక్యుమెంటరీ ఏక పక్షంగా ఉందన్నారు. అందువల్లే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన నిషేధిస్తున్నామని ప్రకటించారు. ట్విట్టర్,  యూట్యూబ్ ఛానెళ్లలో ఉన్న ఈ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 


జేఎన్‌యూలో డాక్యుమెంటరీ ప్రదర్శనపై అభ్యంతరాలు


జనవరి 25వ తేదీ మంగళ వారం రోజు ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో(జేఎన్‌యూ) డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామంటూ కరపత్రాలను విడదల చేశారు. దీంతో ఏబీవీపీ నాయకులు దీన్ని అడ్డుకోవాలంటూ నానా హంగామా చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చలరేగింది. దీంతో క్యాంపస్ లో డాక్యుమెంటరీ ప్రదర్శనను అధికారులు రద్దు చేశారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన సాగింది.