Spurious Liquor: ఏపీలో కల్తీ సారా మరణాలు అసెంబ్లీలో గందరగోళానికి కారణం అవుతున్నాయి. అవన్నీ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ నేతలు ఆరోపించడంతో పాటు విచారణకు ఆదేశించాలని తాజా సమావేశాలలో విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో మరో రాష్ట్రంలో కల్తీ సారా, కల్తీ మద్యం మరణాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 32 మంది చనిపోయినా 50 మంది ప్రాణాలు కోల్పోయినా తమకు లెక్కలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. అయితే ఇటీవల కల్తీ మద్యం మరణాలు ఎక్కువ కాగా, ప్రభుత్వ నేతలపై విమర్శలు వస్తున్నాయి. కల్తీ మద్యం తాగి సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంపై జనతా దళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే గోపాల్ మండల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం నితీష్ కుమార్ రాష్ట్రంలో మద్యం దుకాణాలను గతంలోనే మూసివేయించారు. రాష్ట్రంలో మద్యంపై నిషేధం ఉంది కనుక.. కల్తీ మద్యం తాగి 32 మంది చనిపోయినా, 50 మంది చనిపోయినా మేం పట్టించుకోం అని జేడీయూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సీనియర్ పోలీస్ అధికారులు తమ స్వప్రయోజనాల కోసం మద్యం అక్రమ రవాణా చేసే వారితో చేతులు కలిపారని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ గోపాల్ మండల్ ఆరోపించారు. 






కల్తీ మద్యం మరణాలు ఎక్కువే..
మద్య నిషేధం పూర్తి స్థాయిలో అమలలో ఉన్న రాష్ట్రం బిహార్. ఇక్కడ 2016 ఏప్రిల్ లో పూర్తిగా మద్య నిషేధం విధించారు. దీంతో ఇక్కడ కల్తీ మద్యం ప్రాణ నష్టానికి కారణంగా మారింది. ఈ ఏడాది జనవరిలో నలంద జిల్లాలో చోటి పహరి, పహరితల్లి ఏరియాలో కల్తీ మద్యం తాగిన 11 మంది చనిపోవడం తెలిసిందే.  పలు జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు నిత్యం నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై, నితీష్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కల్తీ మద్యం తాగి 32 మంది చనిపోయారని, ప్రభుత్వానిదే బాధ్యతని విపక్షాలు విమర్శించగా.. తమ ప్రభుత్వం గతంలోనే మద్య నిషేధం విధించిందని.. ప్రస్తుత మరణాలకు అవినీతికి పాల్పడే పోలీసులు కారణమని జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Also Read: LPG Cylinder Price Hike: సామాన్యులకు గ్యాస్ సిలిండర్ ఝలక్! LPG ధర పెంపు, ఇంధన ధరలకు తోడు ఇది కూడా


Also Read: Watch Video : 125 ఏళ్ల యోగా లెజెండ్ స్వామి శివానందపై నెటిజన్లు ప్రశంసలు, పద్మ శ్రీ అందుకున్న తీరుకు ఫిదా!