Yoga Legend Swami Sivananda : దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత తొలి సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్ ​కు మరణానంతరం పద్మ విభూషణ్​ ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ఆయన కుమార్తెలు క్రితిక, తరణి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ​కాంగ్రెస్ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్‌కు​ పద్మ భూషణ్​ అవార్డు దక్కింది. 






స్వామి శివానంద నమస్కార విధానంపై నెటిజన్లు ప్రశంసలు  


యోగా రంగంలో చేసిన విశేష కృషికి గాను 125 ఏళ్ల యోగా అభ్యాసకుడు స్వామి శివానందకు సోమవారం పద్మశ్రీ అవార్డు లభించింది. శివానంద బహుశా దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కారు. శివానంద 'యోగ్ సేవక్'గా సుపరిచితులు. ఏఎన్ఐ వార్తా సంస్థ విడుదల చేసిన వీడియోలో స్వామి శివానంద అవార్డును స్వీకరించడానికి ముందు గౌరవ సూచకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మోకాళ్లపై వంగి నమస్కరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద నమస్కరించిన తీరు భారతదేశ నిజమైన సంస్కృతికి నిదర్శనం అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.


మూడు దశాబ్దాలుగా కాశీ ఘాట్ లో యోగా శిక్షణ


స్వామి శివానంద నిరాడంబరమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఇప్పటికీ తన చుట్టూ పక్కల వారికి సేవ చేస్తున్నారు. ఆయన మూడు దశాబ్దాలకు పైగా కాశీ ఘాట్‌లలో యోగాభ్యాసం, శిక్షణ ఇస్తున్నారు. కచ్ వరద బాధితుల కోసం 'క్లాత్ బ్యాంక్' ఏర్పాటు చేసిన 91 ఏళ్ల వృద్ధురాలు, పోలియోకు వ్యతిరేకంగా పోరాడుతున్న 82 ఏళ్ల ఆర్థోపెడిక్ సర్జన్, కశ్మీర్‌లోని బందిపోరాకు చెందిన 33 ఏళ్ల మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, 2021కి పద్మశ్రీ అవార్డు పొందిన హీరోలు. 


విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కేంద్రం పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించిన కేంద్రం..17 మందిని పద్మభూషణ్‌, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. రెండో విడత అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది