మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలోకి చొరబడిన చిరుత సుమారు ఆరుగంటలపాటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి దాక్కుంది. ఉదయం షిప్టునకు వచ్చిన కార్మికులు చిరుత తిరుగుతుండటాన్ని గమనించారు. వెంటనే ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసి అలారం మోగించారు.
పుణెలోని చకన్ ప్లాంట్ జరిగిందీ సంఘటన. చిరుత అలజడి సృష్టించడంతో సుమారు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. చిరుతను అక్కడి నుంచి తీసుకెళ్లేంత వరకు కార్మికులను లోపలికి అనుమతించలేదు. విషయాన్ని తెలుసుకున్న మహారాష్ట్ర అటవీ శాఖాధికారులు కార్ల ఫ్యాక్టరీకి చేరుకున్నారు. వంద ఎకరాల ఫ్యాక్టరీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మానిక్‌దో చిరుత రెస్క్యూ కేంద్రం నుంచి వచ్చిన ఎస్‌ఓఎస్ బృందం ఈ చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. ఫ్యాక్టరీలో అప్పటికే పని చేస్తున్న కార్మికులను చిరుత బారిన పడకుండా సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
సుమారు ఆరు గంటల పాటు సాగిందీ ఆపరేషన్. చివరకు ఫ్యాక్టరీలోని ఓ షెడ్‌లో దాక్కొని ఉన్న చిరుతను గుర్తించి పట్టుకున్నారు. దీని కోసం రెండు బృందాలు పని చేశాయి. చిరుతకు ట్రాప్ వేసి పట్టుకున్నాయి. సుమారు 11. 30 గంటలకు చిరుతను బంధించి తరలించారు. ప్రత్యేక సిద్ధం చేసిన కేజ్‌లో జునార్‌కు తరలించారు. ప్రస్తుతం చిరుత వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఒకట్రెండు రోజులు చూసిన తర్వాత చిరుతలను అడవిలోకి విడిచిపెడతారు.
పట్టుకున్న చిరుతల వయసు రెండు మూడు సంవత్సరాలు ఉంటుందన్నారు అధికారులు. విజయవంతంగా చిరుతను బంధించి తరలించిన తర్వాత కార్యకలాపాలు ప్రారంభమైనట్టు కార్ల ఫ్యాక్టరీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం. మనుషుల ప్రాణాలు ఎంత ముఖ్యమో జంతువుల ప్రాణాలు అంత ముఖ్యమే అన్నారు సంస్థ సీఈవో. అందుకోసం చుట్టుపక్కల ఉండే జంతువులకు ఎలాంటి హాని జరగకుండా తగిన జాగ్రత్త తీసుకుంటామన్నారు. అదే టైంలో తమ సంస్థ ఉద్యోగుల భద్రత కూడా చూసుకుంటామన్నారు.