Malkajgiri Toilet Theft : మొన్న ఏటీఎంలో బ్యాటరీల చోరీ చేస్తే ఇవాళ ఏకంగా సులభ్ కాంప్లెక్స్ ఎత్తైశారు. తెలంగాణలోని మల్కాజిగిరి 140వ డివిజన్ సఫీల్ గుడాలో సులభ్ కాంప్లెక్స్ చోరీకి గురైంది. ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్ ని ఓ స్క్రాప్ షాప్ లో కొందరు వ్యక్తులు జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి అమ్ముకోవడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ జైన్ కన్స్ట్రక్షన్ వద్ద ఉన్న ఐరన్‌తో తయారు చేసిన పబ్లిక్ టాయిలెట్‌ను ముషీరాబాద్‌లోని స్క్రాప్ షాపుకు రూ. 45,000 లకు అక్రమంగా అమ్మేసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ నెల 17 వ తేదీన మల్కాజిగిరి సర్కిల్ 28 జి.హెచ్.ఎం.సి డిప్యూటీ కమిషన్ రాజు ఆనంద్ బాగ్ జైన్ కన్స్ట్రక్షన్ ఎదురుగా ఉన్న పబ్లిక్ టాయిలెట్ మిస్సింగ్ అయిందని మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మల్కాజిగిరి పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా జైన్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్, దానికి సంబంధించిన టాటా ఏస్ వాహనం డ్రైవర్ తో పాటు, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో పనిచేసే వ్యక్తి కలిసి టాయిలెట్ అమ్మేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు కలిసి రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టాయిలెట్ ను ముషీరాబాద్ లోని స్క్రాప్ దుకాణంలో రూ.45 వేలకు అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.


సులభ్ కాంప్లెక్స్ మాయం 


గతంలో ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ , సులబ్ కాంప్లెక్స్ మాయం అవ్వడంపై మల్కాజిగిరి జీహెచ్ఎంసీ అధికారులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒక ప్రైవేట్ వ్యక్తి, జీహెచ్ఎంసీ సిబ్బంది, మరొకరు నిర్మాణ సంస్థ సూపర్వైజర్ ఉన్నట్లు సమాచారం. జరిగిన సంఘటనపై మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ తనకు స్థానికంగా ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేయగా మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లానని చెప్పారు. నేరం జరిగిన చోట సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ నిధులతో ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్ కూడా అమ్ముకుంటుంటే అధికారులు నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"నా ఇంటిపై దాడి చేస్తే సీసీ కెమెరాలు పనిచేయావ్. మద్యం తాగి ఎమ్మెల్యే కుమారుడు ప్రమాదాలు చేస్తే సీసీ కెమెరాలు పనిచేయావ్. జీహెచ్ఎంసీ సిబ్బంది చివరికి టాయిలెట్ అమ్మేసుకుంటే అక్కడ సీసీ కెమెరాలు పనిచేయలేదు అని పోలీసులు చెప్పడం సరికాదు. హైదరాబాద్ సీసీ కెమెరాల ఏర్పాటులో టాప్ ప్లేస్ లో ఉందని చెప్పే పోలీసులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయడంలేదని చెప్పడం అనుమానాలు వస్తున్నాయి. " -మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్