భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్నదాని కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న అనుకూల వాతావరణంతో నైరుతి రుతుపవనాలు ఈ 15 కల్లా అండమాన్ నికోబార్ తీరాలకు తానున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 


ఈ నెల 15 నాటికి భారత్‌ను తొలకరి పలకరించనుంది. మే 15కల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. మే 15న అండమాన్‌ను తాకిన రుతుపవనాలు 22 నాటికి మాయాబందర్‌కు చేరుకుంటాయి. ఇప్పుడున్న వాతావరణాన్ని పరిశీలిస్తే అనుకున్నదాని కంటే ముందుగానే కేరళను రుతుపవనాలు తాకవచ్చని అంచా వేసింది ఐఎండీ. 
నార్మల్‌గా ప్రతి సంవత్సరం జూన్ నాటికి రుతపవనాలు కేరళను తాకుతుంటాయి. కానీ ఈసారి అంతకంటే ముందే మే చివరి వారానికి కేరళలో తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మొహాపాత్ర.


కేరళలో మే చివరికి నైరుతి చేరుకుంటే... తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు చేరుకోవడానికి మరో వారం రోజులు పట్టొచ్చని... అంటే జూన్ మొదటి వారంలోనే నైరుతి పలకరించే అవకాశం ఉందంటోంది ఐఎండీ. 






గత మూడు రోజులుగా అసని తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు పడ్డాయి. వాతావరణం చల్లగా మారింది. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు కూడా త్వరగానే వస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి. ఎండల నుంచి ప్రజలు పూర్తిగా ఉపశమనం పొందినట్టే అంటోంది వాతావరణ శాఖ.