Parliament Elections 2024: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి ఆమె తప్పుకోనున్నారా... వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో సోనియా పోటీ చేయనున్నారని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. గత పదేళ్లుగా 
దేశంలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. దీంతో వరుసగా మూడోసారి కూడా అధికారానికి దూరమైతే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మరింత బలహీన పడే అవకాశముంది. దీంతో రానున్న ఎన్నికలు కాంగ్రెస్‌కు చావోరేవో అనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో సోనియా పోటీకి దూరం కానుండటం హస్తం పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది


లోక్‌సభ ఎన్నికలకు ఎందుకు దూరం అవుతున్నారు.. 
అయితే సోనియా పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. 77 ఏళ్ల వయస్సు ఉన్న సోనియగాంధీ గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పలుమార్లు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో కూడా చేరారు. విదేశాలకు వెళ్లి కూడా ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. అనారోగ్యం రీత్యా ఎన్నికల్లో  పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కొంతమంది చెబుతున్నారు. అయితే మరోక కారణం కూడా బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీని పోటీలోకి దింపేందుకే సోనియా తప్పుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. సోనియా స్థానంలో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. ప్రియాంకకు లైన్ క్లియర్ చేసేందుకే సోనియా పోటీ చేయకుండా తప్పుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది.


రాయ్‌బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. 2006 నుంచి అక్కడ సోనియా వరుసగా గెలుస్తూ వస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందిన 2019 ఎన్నికల్లో కూడా సోనియా రాయ్‌బరేలీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు 1950 నుంచి కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తున్నారు. అయితే ప్రియాంక గాంధీ ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తున్నారు తప్ప ఎప్పుడూ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రియాంకగాంధీ తొలిసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రియాంకకు తన స్థానమైన రాయ్‌బరేలీ సురక్షితమైన సీటు అని సోనియా భావిస్తున్నారు. అందుకే కూతురు కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నారనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 


గత ఎన్నికల్లోనే ప్రియాంక పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీపై ప్రియాంక బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేశారు. యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. అయినా లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది. బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత యూపీ రాజకీయాలకు ప్రియాంక దూరమయ్యారు. గత ఎన్నికల్లో ఏకంగా యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు.