JEE Main 2024 Session1 Toppers: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరి 13న ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ముఖ్యంగా 100 పర్సంటైల్ సాధించిన 23 మంది విద్యార్థుల్లో తెలంగాణ విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు. తెలంగాణ నుంచి ఏడుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లోఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున; ఢిల్లీ, హర్యానా నుంచి ఇద్దరు చొప్పున; తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు.
ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్ పేపర్ -1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించగా.. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండటం విశేషం. వీరిలో ఇందులో, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినవారిలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల టాపర్లు వీరే..
➥ తెలంగాణ నుంచి రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, మూతవరపు అనూప్, హందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేశ్ రెడ్డి 300లకు 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్ పొందారు.
➥ ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి 100 పర్సంటైల్ స్కోరు సాధించారు.
జేఈఈ మెయిన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్ ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి..
* 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రాలవారీగా
➥ తెలంగాణ - 7
➥ హర్యానా - 2
➥ ఆంధ్రప్రదేశ్ - 3
➥ తమిళనాడు - 1
➥ ఢిల్లీ - 2
➥ మహారాష్ట్ర - 3
➥ రాజస్థాన్ - 3
➥ గుజరాత్-1
➥ కర్ణాటక - 1
జేఈఈ మెయిన్-2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం (ఫిబ్రవరి 13న) ఉదయం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా తెలుసుకోవచ్చు.
6 ప్రశ్నలు తొలగింపు..
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్-1 తుది కీని ఎన్‌టీఏ ఫిబ్రవరి 12న మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించారు.
జేఈఈ మెయిన్ చివరి విడత (సెషన్-2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నారు. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్చి 2న అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీప్లానింగ్) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.
ఇక జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 2న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
JEE (Main) - 2023 Notification