Sonia Gandhi: కరోనా బారిన పడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ కీలక సమాచారం వెల్లడించింది. కొవిడ్ అనంతరం సోనియా గాంధీ శ్వాస కోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను వైద్యులు గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.






పోస్ట్ కొవిడ్ లక్షణాలు


ఇన్ఫెక్షన్‌తో పాటు ఇతర కొవిడ్ అనంతర లక్షణాలకు సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. సోనియా ప్రస్తుతం దిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దిగువ శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్‌ను వైద్యులు గుర్తించి, చికిత్స అందిస్తున్నారు. 


ఇన్ఫెక్షన్ గుర్తించిన వెంటనే చికిత్స ప్రారంభించి ఇందుకు సంబంధించిన వైద్య పక్రియలు వైద్యులు మొదలు పెట్టినట్లు కాంగ్రెస్ పేర్కొంది. కొవిడ్ బారినపడ్డ సోనియా జూన్ 12న ఆసుపత్రిలో చేరారు.


రాహుల్‌కు అనుమతి


మరోవైపు రాహుల్ గాంధీకి సోమవారం వరకు ఈడీ మినహాయింపు నిచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో వరుసగా మూడు రోజులు విచారణను ఎదుర్కొన్న రాహుల్‌గాంధీ తదుపరి విచారణకు సోమవారం వస్తానని ఈడీని కోరారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సోనియా గాంధీ వద్ద ఉండాల్సిన బాధ్యత కుమారుడిగా తనకు ఉందని రాహుల్ గాంధీ ఈడీకి తెలిపారు. ఇందుకు ఈడీ అధికారులు కూడా అంగీకరించారు. 


ఇదీ కేసు


కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.


ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు. 


Also Read: Agnipath Scheme Protests India: 7 రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసన జ్వాలలు- బిహార్ డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు


Also Read: Agnipath Protests In Hyderabad: అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు