Social Media: చేతిలో సెల్‌ఫోన్ ఉంది. దానిలో కావల్సినంత డేటా ఉంది. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, స్నాప్ చాట్, వాట్సప్ ఇలా కావల్సినన్ని సోషల్ మీడియా యాప్‌లు. ప్రతి దాంట్లో పోస్టులు. ఒక సారి శాడ్ స్టేటస్‌లు, ఇంకో సారి పట్టలేని సంతోషం, కొన్ని సార్లు పాటలు, మూడు బాగలేకపోతే కన్నీటి కష్టాలు తెలిపేవి ఇలా చాలా మంది స్టేటస్, పోస్టులు పెడుతుంటారు.
కొందరు ప్రేమ గురించి పెడితే, మరి కొందరు సినిమాలు, పాటలు, ఇంకా కొందరు లైఫ్‌తో తాము ఏదో కోల్పోయినట్లు, కొందరు వ్యక్తిత్వం గురించి ఇలా పోస్ట్ చేస్తుంటారు. ఇంకొకరు వారి మెంటల్ హెల్త్ తెలిసేలా పోస్టులు వేస్తుంటారు. అయితే అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి మానసిక ఆరోగ్యాన్ని బట్టి ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారని ఓ అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మానసిక ఆరోగ్యం గురించి చర్చించడం, పోస్టులు చేయడం ఉద్యోగాలు వచ్చే అవకాశాలను ప్రభావితం చేయవచ్చని ఒక అధ్యయనం తెలిపింది. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఓ అధ్యయం చేపట్టారు. లింక్డ్‌ఇన్‌లో మానసిక ఆరోగ్యం పోస్ట్‌లు ఒక ఉద్యోగి వ్యక్తిత్వం, కార్యాలయంలో అతని పనితీరుపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు యత్నించారు
అధ్యయనంలో వారు 409 మంది హైరింగ్ నిపుణులను కలిశారు. ఒక అభ్యర్థి ఆడియో ఇంటర్వ్యూను కూడా వారికి వినిపించారు. దాని ఆధారంగా ఉద్యోగ అభ్యర్థి వ్యక్తిత్వం, కార్యాలయంలో భవిష్యత్తు పనితీరు గురించి అడిగారు. అలాగే మానసిక ఆరోగ్యం గురించి లింక్డ్‌ఇన్ పోస్ట్ చేసిన లేదా దానిపై చర్చించిన ఉద్యోగ అభ్యర్థుల్లో మానసిక స్థిరత్వం లేదని అధ్యయనంలో తేలింది. ఈ ఫలితాలను జర్నల్ ఆఫ్ బిజినెస్ అండ్ సైకాలజీలో ప్రచురించారు.
తమలో ఉన్న భయం, ఆత్మనూన్యతలను తగ్గించుకోవడానికి సోషల్ మీడియాలో వారి మానసిక ఆరోగ్యం గురించి తరచుగా ఉద్యోగ అభ్యర్థులు చర్చిస్తారని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ మనస్తత్వ శాస్త్ర ప్రొఫెసర్ లోరీ ఫోస్టర్ అన్నారు. లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మానసిక ఆరోగ్యం, మానసిక స్థితిపై పోస్ట్‌లు, చర్చలు చేసేవారు ఊహించలేని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు.
మెరెడిత్ కాలేజీ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెన్నా మెక్ చెస్నీ అధ్యయనం గురించి మాట్లాడుతూ.. ఎవరైనా తమ మానసిక ఆరోగ్య అనుభవాలను ఆన్‌లైన్‌లో పంచుకోవాలా వద్దా అనేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అన్నారు. లింక్డ్‌ఇన్‌లో ఆందోళన, నిరాశ గురించి పోస్ట్ చేయకుండా ఉండాలనేది తమ పరిశోధనల ఉద్దేశం కాదన్నారు.
ఫైనల్‌గా ఏంటంటే ఉద్యోగాలను వెతుక్కునే వారు సోషల్ మీడియాలో తమ మానసిక ఆరోగ్య పరిస్థితలను పెట్టకపోవడం ఉత్తమం. వారి భావోద్వేగాలపై నియంత్రణ ఉండాలని అధ్యయనం చెబుతోంది. ఉద్యోగార్థుల సోషల్ మీడియా పోస్టులు వారి ఉద్యోగాలను సైతం డిసైడ్ చేస్తోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే అభ్యర్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను కంపెనీలు పరిశీలించి వారి మానసిక పరిస్థితిని, ఆఫీస్‌ల్లో వారు ఎలా మెలుగుతారో అంచనా వేసుకుంటున్నాయి.