Corruption Cases: దిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్‌ కేజ్రీవాల్‌ ( Aravind Kejriwal )అరెస్టయ్యారు. మద్యం పాలసీ కేసులో ఆయన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్టయిన తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డులకెక్కారు. ముఖ్యమంత్రులుగా పని చేసి...అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు చాలా మందే ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చాలా పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. కొందరు అరెస్టయి జైలు జీవితం గడుపుతుంటే...మరికొందరు బెయిల్ పై బయటకు వచ్చారు. ఇంకొందరిపై ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిపై కేసులు...ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. బిహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన లాలు ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రులుగా పని చేసిన మధుకోడా, హేమంత్ సోరెన్, హర్యానా సీఎంగా పని చేసిన ఓం ప్రకాశ్ చౌతాలా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అక్రమాస్తుల కేసులో ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. 


స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. దాదాపు రెండు నెలల పాటు జైలులో ఉన్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. 1995 నుంచి 1999, 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు పని చేశారు. 


కలర్ టీవీ కొనుకోళ్ల కేసులో దివంగత సీఎం జయలలిత
1996లో డిసెంబరు 7న జయలలిత అరెస్టయ్యారు. కలర్‌ టీవీల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లివచ్చారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో...జయలలితను కోర్టు దోషిగా తేల్చింది. దీంతో రెండోసారి తలైవి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.  2016 ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మరణించే వరకు తమిళనాడు సీఎంగా పని చేశారు. 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 


దాణా కుంభకోణం కేసులో లాలూ
దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లారు. పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూతో పాటు మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రాలను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చడంతో జైలుకు వెళ్లారు. అనంతరం బెయిల్ బయటకు వచ్చారు లాలూ ప్రసాద్. 1990-1997 మధ్యకాలంలో బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 


ఝార్ఖండ్ నుంచి ఇద్దరు సీఎంలు జైలుకు...
ఝార్ఖండ్ కు సీఎంగా పని చేసిన మధుకోడా...మైనింగ్‌ కేసులో 2009లో అరెస్టయ్యారు. 2006-2008 మధ్య ఝార్ఖండ్ సీఎంగా పనిచేశారు మధు కోడా.  భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో హేమంత్ సోరెన్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. 2013-2024 మధ్య కాలంలో ఝార్ఖండ్‌ సీఎంగా పనిచేశారు. 


ఉపాధ్యాయ నియామకాల కేసులో చౌతాలా 
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా...ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లారు. ఈ కేసులో 2013లో కోర్టు దోషిగా తేల్చడంతో పదేళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన జైలులోనే ఉన్నారు. అక్రమాస్తుల కేసులోనూ 2022లో కోర్టు ఆయనకు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది. 1989 నుంచి 2005 వరకు నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16నెలల పాటు జైలు శిక్షఅనుభవించారు. జైలు నుంచి విడుదలయిన తర్వాత సీఎం అయ్యారు. అనేక మంది ముఖ్యమంత్రులపై వివిధ రకాల కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, స్టాలిన్ వంటి వారిపై కేసులు ఉన్నాయి.