Signal And Route Mismatch Is The Reason For Train Accident: తమిళనాడులోని (Tamilnadu) తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును.. భాగమతి ఎక్స్ ప్రెస్ (Bhagamati Express) ఢీకొట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది. గతేడాది ఒడిశాలో 3 రైళ్లు ఢీకొన్న ఘటనను మరువక ముందే ఈ ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే, సిగ్నల్, మార్గం మధ్య మిస్ మ్యాచ్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు. మెయిన్ లైన్‌లోకి రైలు వెళ్లేలా సిగ్నల్ ఇవ్వగా.. ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్‌లోకి మళ్లించిందని పేర్కొన్నారు. ఎక్కడో తప్పిదం కారణంగానే గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్ పైకి ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లిందని తెలిపారు. ఎక్స్ ప్రెస్ లూప్‌లైన్‌లోకి వెళ్లే ముందు భారీ కుదుపు వచ్చిందని తెలుస్తోంది.


విచారణకు ఆదేశం


మరోవైపు, ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని.. కచ్చితంగా ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ తెలిపారు. అలాగే, తిరువళ్లూరు వద్ద ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.


ఇదీ జరిగింది


తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా దర్బంగా వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్ (రైలు నెం. 12578).. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ గూడ్స్ రైలును అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 వరకూ భోగీలు పట్టాలు తప్పాయి. 2 భోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. కొన్ని భోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. మరికొన్ని ఒకదానిపై ఒకటి చేరాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పలువురు ప్రయాణికులు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే పోలీసులు తెలిపారు. చెన్నై రైల్వే డివిజన్ 044 2535 4151, 044 2435 4995 హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.


పలు రైళ్లు రద్దు


ఈ ప్రమాదంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, తిరుపతి - పుదుచ్చేరి మెము, డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి మెము, అరక్కోణం- పుదుచ్చేరి మెము, విజయవాడ - డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-అరక్కోణం మెము, తిరుపతి- డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మెము, అరక్కోణం- తిరుపతి మెము ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసిట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంతో చెన్నై సెంట్రల్ నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, నెల్లూరు - చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.


Also Read: Aadhar : ఆధార్ సాయంతో ఆరేళ్లకు ఇంటికి చేరిన కొడుకు - ముంబై కుటుంబ వేదనకు కడపలో కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్