Ayodhya Sri Rama Temple Inauguration Ceremony: వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవానికి (Opening Ceremony)చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి హాజరుకావాలని అయోధ్య ట్రస్టు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు,  క్రీడాకారులు, అధ్యాత్మిక వేత్తలకు ఆహ్వానాలు పంపింది. మరికొందరికి ఆహ్వానాలు పంపుతోంది. అయితే కొందరు రాజకీయ నేతలను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌  (Sharad Pawar) తెలిపారు. రామాలయ ప్రారంభోత్సవానికి మీరు వెళుతున్నారా ? అన్న మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. అందరి సహాకారంతో రామాలయం నిర్మించడం ఆనందంగా ఉందన్న శరద్ పవార్, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రామాలయాన్ని వాడుకుంటుందో లేదో చెప్పలేమన్నారు. 


మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి దూరం
మరోవైపు  ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. పార్టీ, ప్రభుత్వం తరఫున ప్రతినిధిని కూడా పంపించకూడదని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదు.  అటు జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి  లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా తాము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం అని వివరించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 20- 24 మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ కూడా హాజరవుతారు. 


70 ఎకరాల విస్తీర్ణంలో మరో 7 ఆలయాలు
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు  చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని  సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్‌లో మార్బుల్‌ను అమర్చారు.