Vijayakanth Political Career : సినిమా హీరో అనేక విజయాలు అందుకున్న కెప్టెన్ విజయకాంత్‌(Vijayakanth ) రాజకీయంగా సంచలనాలు నమోదు చేయకపోయినా ప్రత్యర్థుల విజయాన్ని మాత్రం డిసైడ్‌ చేసే స్థాయికి వెళ్లారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండటమే ఆయన రాజకీయాల్లో సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి రాకముందు విజయకాంత్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ఓ ట్రెండ్‌ సెట్‌ చేసుకున్నారు. 


2005లో పార్టీ ఏర్పాటు


దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) పేరుతో 14 సెప్టెంబర్ 2005లో మధురైలో పార్టీ ఏర్పాటు చేశారు విజయ్‌ కాంత్‌. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో పోటీ చేశారు. అనుకున్న విజయాన్ని సాధించలేకపోయారు. ఆయన మాత్రం తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇతరపార్టీల ఓట్లు కొల్లగొట్టడంతోపాటు చాలా మంది అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమికి విజయ్‌ కాంత్‌ పార్టీయే కారణమనే విశ్లేషణలు బలంగా వినిపించాయి. 


2011లో జయలలితతో పొత్తు


2011 ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. 41 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 29 స్థానాల్లో విజయం సాధించారు. ఆ ఎన్నిక్లోల డీఎంకే కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుందీ పార్టీ. రిషివంధియం నియోజకవర్గం నుంచి విజయకాంత్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జయలలితతో విభేదాలు కారణంగా అన్నాడీఎంకే నుంచి విడిపోయారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో విజయ్‌కాంత్‌ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఎన్డీయే నేతల సమావేశంలో విజయ్‌కాంత్‌ పేరును ప్రస్తావించిన మోదీ... తన ఆప్తమిత్రుడిగా పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇంతలో 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆయన ప్రతిపక్ష నేతగా అర్హత కోల్పోయారు. 


2016 ఘోర ఓటమి


2016 ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి పాలయ్యారు. కనీసం ఆయన కూడా గెలవలేదు కదా కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఆ దఫా ఎన్నికల్లో తమిళనాడులోని విలుపురం జిల్లాలోని ఉలుందూర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. విజయ్‌కాంత్‌కి కేవలం 34,447 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానాన్ని ఏఐడీఎంకే కైవశం చేసుకుంది. 


విజయ్‌ కాంత్‌ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేశారు. మూడు సార్లు కూడా మూడు నియోజకవర్గాల నుంచి  పోటీ చేశారు. ఇందులో రెండుసార్లు మాత్రమే విజయం సాధించారు. మొదటి సారి 2006లో వృద్ధాచలం నుంచి పోటీ చేసి 40.49 శాతం ఓట్లతో విజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో 2011లో రుషివందియం నుంచి పోటీ పడ్డారు. అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ఆయనకు 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. మూడోసారి 2016 ఎన్నికల్లో ఉలుందూరిపేటలో పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో ఆయన పోటీకి దూరమయ్యారు.