Semi Conductor: స్మార్ట్ ఫోన్ల నుంచి ఇంటర్నెట్ ను శాసించే డేటా సెంటర్ల వరకు అన్నింటిలో సెమీకండక్టర్లు చాలా కీలకం. ఆధునిక సెమీకండక్టర్ టెక్నాలజీలు వాతావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ల అభివృద్ధిలోనూ కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చిప్ ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత రానున్న రోజుల్లో మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వాడకం లాంటివి పెరిగే అవకాశాలు ఉండటంతో చిప్ లకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత్.. సెమీకండక్టర్ తయారీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు కేంద్రం 50 శాతం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2024 నాటికి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా సెమీకండక్టర్ చిప్ ని తీసుకువస్తామని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. మేడిన్ ఇండియా సెమీకండక్టర్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు, గృహోపకరాలు, గేమింగ్ హార్డ్ వైర్ ధరలు భారీగా తగ్గుతాయని చెప్పుకొచ్చారు. 


సెమికాన్ ఇండియా-2023లో మోదీ ఏం చెప్పారు?


గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో జరిగిన సెమికాన్ ఇండియా-2023 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. భారత్ లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు. పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పిన మోదీ.. సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ గ్రాండ్ కండక్టర్ గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. నమ్మకమైన చిప్ సప్లై లైన్ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 


క్రమంగా పెరుగుతున్న దేశీయ మార్కెట్


చిప్ తయారీ సరఫరా గొలుసులోని ప్రొడక్ట్ డెవెలప్మెంట్, డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీపీ(అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్), సపోర్ట్ లలో ప్రస్తుతం భారత్ లో ఉన్న పరిశ్రమలు ఎక్కువగా డిజైన్ ఫంక్షన్ లో మాత్రమే పని చేస్తున్నాయి. చిప్ తయారీలో భారత్ లోని పరిశ్రమలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ప్రపంచంలోని నిపుణుల్లో భారత్ లోనే 20 శాతం మంది వరకు ఉన్నారన్నది డెలాయిట్ సంస్థ అంచనా. లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల్లో మెరుగుపడటం, స్థిరంగా నాణ్యమైన విద్యుత్ అందించడం, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన వనరులు సమకూర్చుకోవడం లాంటివి భారత్ లో సెమీకండక్టర్ల పరిశ్రమలకు కీలకం. దాదాపు అన్ని దేశాలు చైనాకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాయి. అలా కూడా భారత్ కు పరిశ్రమలు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అమెరికాకు భారత్ మిత్రదేశం అయినందు వల్ల అమెరికన్ కంపెనీలకు భారత్ గమ్యస్థానంగా మారవచ్చు. 


భారత్ కు ఎదురయ్యే సమస్యలు


సాఫ్ట్ వేర్ లో మొదటి వరుసలో ఉంటుంది భారత్. కానీ హార్డ్‌వేర్, తయారీ పరిశ్రమల విషయానికి వస్తే మాత్రం భారత్ ది వెనక స్థానమే. పరిశ్రమల కోసం అనుకూల వాతావరణం సృష్టించడం, సుంకాలు, రాయితీలు కల్పించడం లాంటి సంస్కరణలు చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాలపై ప్రముఖంగా దృష్టి సారించి ఒక్కోటి పూర్తి చేసుకుంటూ వెళ్లడం ద్వారా పరిశ్రమలను ఆకట్టుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ అడ్డంకులను తొలగించుకుంటేనే చైనాను కాదని పరిశ్రమలు భారత్ బాట పడతాయి. సప్లయిర్స్, పార్ట్‌నర్స్, కన్జూమర్స్, లాజిస్టిక్ నెట్‌వర్క్ వంటివి కల్పిస్తేనే పరిశ్రమలు భారత్ కు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.