Lok Sabha Elections: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాక విదేశాల్లో ఆశ్రయం కోసం వెతుకుతున్నారని లాలూ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని మోదీ ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి I.N.D.I.A ను ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలు.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. క్విట్ ఇండియా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లాలూ.. రాబోయే ఎన్నికల్లో మోదీ ఓడిపోయిన తర్వాత.. దేశాన్ని వదిలేసే ఆలోచనలో ఉన్నారని, అందుకే నరేంద్ర మోదీ విదేశాలను సందర్శిస్తున్నారని అన్నారు. 


విదేశాల్లో పిజ్జాలు, మోమోస్, చౌ మెయిన్ లను ఆస్వాదించగలిగే ప్రదేశాన్ని మోదీ వెతుకుతున్నారని లాలూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ క్రమంగా కోలుకుంటున్నారు. తాజాగా ఆయన బ్యాడ్మింట్ ఆడుతూ ఉల్లాసంగా కనిపించారు. 


ఇండియాను తిట్టి చూడండి: లాలూ


బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం (జులై 30) జరిగిన స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బీజేపీ వర్సెస్ ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీహార్ లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయాన్ని గుర్తు చేసిన లాలూ.. విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టడాన్ని చాలా మంది మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఇండియా వ్యూహానికి సంబంధించి ముంబైలో 3వ సమావేశం జరగనుందని.. విపక్ష పార్టీలన్నీ విభేదాలు మరిచి కలిసి పోటీ చేయాలని సూచించారు. విపక్షాల ఐక్యతపై బీజేపీ తీవ్ర ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు.