వలసరాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ల మధ్య, లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అనేక ప్రాంతాలలో కశ్మీర్ నుంచి కేరళ వరకూ, పంజాబ్ ఈశాన్య రాష్ట్రాల వరకూ "భారత భద్రత, సమగ్రతను" కాపాడటానికి దేశద్రోహ చట్టం అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. గత ఏడాది మేలో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ప్రస్తుతం ఉపసంహరణలో ఉన్న చట్టాన్ని నిలుపుదల చేయాలనే ప్యానెల్ సిఫార్సును సమర్థించారు. దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి తగిన మార్గదర్శకాలను ప్రతిపాదించామని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, జాతీయ భద్రతా చట్టం లాంటి ప్రత్యేక చట్టాలు రెండు వేర్వేరు పనులకు ఉపయోగిస్తున్నారని అన్నారు. కానీ, దేశద్రోహ నేరాలకు ఈ రెండు చట్టాలకు సంబంధం లేదని అన్నారు. అందుకే దేశ ద్రోహంపై నిర్దిష్ట చట్టం కూడా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశద్రోహ చట్టం ఉపయోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ‘‘కశ్మీర్ నుంచి కేరళ - పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఉన్న ప్రస్తుత పరిస్థితి భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి ఈ చట్టం అవసరం’’ అని న్యాయమూర్తి అవస్థి చెప్పారు. దేశద్రోహ చట్టం అనేది వలసరాజ్యాల నాటి తరహాలో ఉండడం వల్ల దాని రద్దు చేస్తున్నామని చెప్పడం సరైన కారణం కాదని అన్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీతో సహా అనేక దేశాలు తమ సొంత చట్టాలను కలిగి ఉన్నాయని కూడా ఆయన అన్నారు.
దేశద్రోహ చట్టానికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ లోని 124ఏ సెక్షన్‌ను పునరుద్ధరించాల్సిందేనని 22వ లా కమిషన్ ఇటీవల కేంద్రానికి ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేసింది. అయితే కొన్ని సవరణలు చేయడంద్వారా ఈ సెక్షన్‌పై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్‌కు 22వ లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని కమిటీ ఓ నివేదిక సమర్పించింది.