Police Brought Electricity: ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ వృద్ధురాలి ఇంట్లో పోలీసులు విద్యుత్ వెలుగులు నింపారు. పోలీసు నిధులతో దగ్గరుండి కనెక్షన్ ఏర్పాటు చేయించి.. బల్బు, ఫ్యాన్ ఇచ్చి ఆమెలో సంతోషాన్ని నింపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎస్పీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. నిరుపేద వృద్ధురాలి ఇంటికి విద్యుత్ కనెక్షన్ తీసుకురావడం ఆమె జీవితంలో వెలుగులు నింపినంత సంతోషంగా ఉందని ఏఎస్పీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ వృద్ధురాలి ముఖంలో చిరునవ్వు ఎంతో సంతృప్తిని ఇస్తోందని పేర్కొన్నారు. ఏఎస్పీ అనుకృతి శర్మ ఈ ట్వీట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయిపోయింది. పోలీసులు చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


పోలీసు నిధులతో వృద్ధురాలి ఇంటికి విద్యుత్ కనెక్షన్


ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఉండే నూర్జహాన్ (70) నిరుపేద కుటుంబం. ఆమె వితంతువు. ఉన్న ఒక్క కూతురికి పెళ్లి కావడంతో చాలా ఏళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నారు. ఆమె ఇంటికి కరెంట్ కనెక్షన్ కూడా లేదు. చీకటి పడిందంటే దీపమే దిక్కు. దీంతో తన ఇంటికి కరెంటు తీసుకురావాలని వృద్ధురాలు నూర్జహాన్ పోలీసులను ఆశ్రయించారు. ఆ 70 ఏళ్ల వృద్ధురాలి అభ్యర్థనపై జిల్లా ఏఎస్పీ అనుకృతి స్పందించారు. నూర్జహాన్ విజ్ఞప్తి మేరకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసు నిధులతో దగ్గరుండి మరీ నూర్జహాన్ ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించారు. దాంతో పాటు ఓ బల్బు, ఫ్యాన్ కూడా అందించారు.


Also Read: PM Modi in MP: ప్రధాని నోటి వెంట యూనిఫాం సివిల్ కోడ్ - ఒకే కుటుంబంలో వేర్వేరు నిబంధనలు ఉండొద్దని కామెంట్‌


బల్బు కంటే ఎక్కువగా వెలిగిపోయిన వృద్ధురాలి ముఖం


తన ఇంట్లో విద్యుత్ వెలుగులు చూసిన ఆ వృద్ధురాలు తెగ సంబరపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎస్పీ అనుకృతి శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. తన ఇంట్లో వెలుగుతున్న బల్బును చూస్తూ.. ఆ వృద్ధురాలు ఆనందపడటం వీడియోలో కనిపిస్తోంది. తన ఇంటికి కరెంటు తీసుకువచ్చిన మహిళా పోలీసు అధికారిని భుజాన్ని తట్టి ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసు అధికారులు నూర్జహాన్ కు స్వీట్స్ తినిపించారు. ఇవి నా జీవితంలోని అత్యంత మధురమైన క్షణాలు అని ట్విట్టర్ లో ఏఎస్పీ అనుకృతి శర్మ పేర్కొన్నారు. నూర్జహాన్ ఆంటీ ఇంటికి కరెంటు తీసుకురావడం ఆమె జీవితంలో వెలుగులు నింపినంత ఆనందాన్ని ఇస్తోందని, ఆమె ముఖంలోని చిరునవ్వు తనకెంతో సంతృప్తినిస్తోందని అనుకృతి శర్మ ట్వీట్ లో రాసుకొచ్చారు.














Join Us on Telegram: https://t.me/abpdesamofficial