SCO Meeting in Delhi: భారత్-చైనా సరిహద్దులపై గతంలో జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించడమే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితికి కారణమని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చైనా అధికారులతో తేల్చి చెప్పారు. గల్వాన్ ఘటన తర్వాత భారత్- చైనా రక్షణ మంత్రుల మధ్య తొలిసారి జరిగిన చర్చల్లో రాజ్‌నాథ్ తో పాటు చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒప్పందాల ఉల్లంఘనల వల్లే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ చర్చల్లో చైనాకు గట్టి సందేశం పంపించారు. సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఆవశ్యకతను నొక్కి చెబుతూనే పాత ఒబ్బందాల ఉల్లంఘనలను ఖండించారు. ఈ చర్యల వల్లే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు. షాంఘై సహకార సమాఖ్య(ఎస్సీవో) సమావేశం సందర్భంగా జరిగిన చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూతో వివిధ విషయాలు చర్చించారు.


వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న అన్ని సమస్యలను ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని చైనాతో రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. ప్రస్తుతానికే ఉన్న ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదికన క్షీణింపజేసిందని స్పష్టం చేశారు. ఒప్పందాల ఉల్లంఘనల వల్ల చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని హెచ్చరించారు. 


ఈ సందర్భంగా రాజ్ నాథ్, లీ సుమారు 45 నిమిషాల సేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలపై, ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తేల్చి చెప్పారు. 


కొంతకాలంగా ఉద్రిక్తత-గమనిస్తూనే ఉందన్న యూఎస్


భారత్ - చైనా మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఉల్లంఘనలతో ఈ పరిస్థితి తలెత్తింది. రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులపై తాజాగా అమెరికా స్పందించింది. భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో ఇంకా అలజడి కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇటు భారత్ మాత్రం యుద్ధ వాతావరణమే వస్తే దీటుగా బదులిస్తామని గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలోనే యూఎస్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌ కీలకంగా మారింది. భారత్, చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ పేరిట ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది అమెరికా జాతీయ నిఘా విభాగం. ఆ రెండు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించింది. 


"భారత్, చైనా మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ 2020లో జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని నిశితంగా గమనిస్తున్నాం. అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య ఏ కాస్త పరిస్థితులు అదుపు తప్పినా అది అమెరికాకు కూడా చేటు చేస్తుంది. అలాంటి  సమయంలో అమెరికా జోక్యం చేసుకోక తప్పదు. క్రమంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ముదిరేలా కనిపిస్తోంది"
- అమెరికా నిఘా విభాగం