Supreme Court- Westlers: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా రెజ్లర్లపై అధ్యక్షుడు లైంగికంగా వేధించాడని ఆయనపై కేసు నమోదు చేసి విచారించాలంటూ క్రీడాకారులు ధర్నా చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదంటూ ఇండియన్ స్టార్ రెజ్లర్లు సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. దీనిపై తమ స్పందన తెలపాలంటూ దిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు నమోదు చేసేలే ఆదేశాలు ఇవ్వాలని ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెజ్లర్ల తరఫున సీనియన్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా.. బ్రిజ్ భూషణ్ పై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషన్ దారులు పేర్కొన్నారు. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం..మహిళల రెజ్లర్ల పిటిషన్ పై ఏప్రిల్ 28న శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. అంతేగాక, ఈ కేసులో ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యూడిషియల్ రికార్డుల నుండి ఆ ఏడుగురు బాధిత రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ ఏడాది జనవరిలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఇండియన్ స్టార్ రెజ్లర్లు రోడ్ల పైకి వచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. బ్రిజ్ భూషణ్ పై ప్రపంచ చాంపియన్ షిప్ పతక విజేత, ఒలింపియన్ వినేశ్ ఫోగట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. లక్నోలోని నేషనల్ క్యాంప్ లో పలువురు కోచ్ లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేశ్ ఫోగాట్ ఆరోపించారు. వినేశ్ ఫోగాట్ తో పాటు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. యూపీలోని కైజర్ గంజ్ బీజేపీ ఎంపీగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్టార్ రెజ్లర్ల్ మేరీ కోమ్ నేతృత్వంలో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెట్టాలంటూ తాజాగా రెజ్లర్లు మరోసారి రోడ్డెక్కారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకునేంత వరకు తాము నిరసన విరమించబోమని చెబుతున్నారు. అప్పటి వరకు అలుపెరగకుండా ధర్నా చేస్తుంటామని అంటున్నారు. మరోవైపు రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో మే 7వ తేదీన జరగాల్సిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపి వేసింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరు?
యూపీలోని కైజర్ గంజ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రిజ్ భూషణ్ 6 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. బ్రిజ్ భూషణ్ శరణ్ 2011 నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.