యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి 112 నెంబర్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. త్వరలోనే యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ చెప్పాడు. అంతే కాదు టెక్స్ట్ మెసేజ్ కూడా పంపించాడు. ఇలా వరుసగా కాల్ చేయడం, మెసేజ్ పంపించడంతో కలకలం రేగింది.
సీఎం యోగికి బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సందేశం పంపించింది ఎవరు ఎక్కడి నుంచి పంపిచారనే దర్యాప్తు ప్రారంభించారు. గోల్ఫ్ సిటీ ప్రాంతంలో ఉండే రిహాన్ నుంచే సీఎం యోగికి బెదిరింపులు వచ్చినట్టు నిర్దారించారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఐపీసీ 506, 507, 66 ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 23వ తేదీ రాత్రి 112కు కాల్ వచ్చింది. తర్వాత మెసేజ్ కూడా వచ్చింది. ఈ రెండింటి సారాంశం ఒకటే. కమ్యూనికేషన్ ఆఫీసర్ శిఖా అవస్థి ఈ రెండింటిని రిసీవ్ చేసుకున్నారు. సిఎం యోగిని చంపేస్తామని అందులో బెదిరించారు. వెంటనే అలెర్ట్ అయిన అవస్థి ఆ మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఉన్నతాధికారులకు పంపించారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ బెదిరింపు వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫేస్ బుక్ లో కూడా బెదిరించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. యోగి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా చాలా సార్లు ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. వారం రోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా కూడా యోగిని చంపేస్తాంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ ఫేస్బుక్ పోస్ట్ బాగ్‌పాట్‌కు చెందిన అమన్ రజా ప్రొఫైల్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో కూడా బుల్లెట్లు పెట్టి సిఎం యోగిని బెదిరించారు. తరువాత ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.