Supreme Court Constitutes Five Judge Bench To Hear Same-Sex Marriage Pleas:
స్వలింగ సంపర్కం అనేది నేరంగా పరిగణించవద్దని గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే స్వలింగ వివాహాలపై ఇప్పటివరకూ చట్టబద్ధత లేదు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత కల్పించాలా వద్దా అనే విషయంపై దాఖలైన పిటీషన్లపై విచారణను 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. సేమ్ సెక్స్ మ్యారేజీకి చట్టబద్దతకు సంబంధించిన పిటిషన్లపై ఏప్రిల్ 18వ తేదీన విచారణ ప్రారంభం కానుంది.
స్వలింగ వివాహాలకు దేశంలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ ఉంది. కానీ ఇలాంటి వివాహాలు హిందూ వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం నిబంధనలకు విరుద్దమని సైతం పలు రాష్ట్రాల హైకోర్టుల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని, కనుక ఈ వివాహాలకు సైతం చట్టబద్ధత కల్పిస్తే ఏ సమస్య ఉండదని దేశ వ్యాప్తంగా కోర్టుల్లో పిటీషన్లు దాఖలవుతున్నాయి. దాంతో సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం జనవరిలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లను హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. మార్చి నెలలో భారత ప్రభుత్వ అభ్యర్థనను సైతం వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
స్వలింగ సంపర్కుల వివాహాని (Same Sex Marriage)కి గుర్తింపు, చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్కులు, రెండు భిన్న సంపర్కుల మధ్య సంబంధాలు స్పష్టంగా భిన్నమైనవి అని తన పిటీషన్ లో కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కులు జంటగా జీవించడాన్ని నేరంగా పరిగణించాలి. అప్పుడే భార్య, భర్త, సంతానం లాంటివి ఓ మంచి కుటుంబంగా ఉంటాయని.. స్వలింగ సంపర్కుల జంటను సాధారణ భార్యభర్తల సంబంధంతో పోల్చి చూడలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది.
సెప్టెంబరు 6, 2018న సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. వయోజన స్వలింగ సంపర్కులు లేదా భిన్న లింగ సంపర్కులు ఏకాభిప్రాయంతో సెక్స్ చేయడం నేరం కాదని ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. బ్రిటీషు పాలనతో చేసిన చట్టాలు వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను కాలరాసేలా ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా స్వలింగ వివాహాల సమస్యను పరిష్కరించాలని మాజీ న్యాయమూర్తులు ఓ ప్రకటనలో కోరారు. త్రిసభ్య ధర్మాసనం నుంచి స్వలింగ వివాహాల చట్టబద్ధత పిటీషన్లను సీజేఐ సహా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 18వ నుంచి ఈ పిటీషన్లపై విచారణ జరగనుంది.