UP Tractor Accident : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నీళ్లు తీసుకురావడానికి 30 మందితో వెళ్తోన్న ట్రాక్టర్‌ అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు అజ్మత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ప్రమాదస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేట్టారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని  షాజహాన్‌పూర్‌ ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు.  ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. 










మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 


మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ ​గఢ్​ జిల్లాలోని ఓల్డ్ ముంబయి- పుణె హైవేపై నుంచి ఓ బస్సు లోయలో పడిపోయింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముంబ జార్జ్ గావ్ ​కు చెందిన బాజి ప్రభు వాడక్​ గ్రూప్​ అనే మ్యూజిక్​ బృందం ఈవెంట్​ కోసం పుణెలోని పింప్రి చిచ్వాడ్​ ప్రాంతానికి వచ్చింది. అక్కడి నుంచి శుక్రవారం అర్ధరాత్రి  తిరిగి జార్జ్ గావ్ కు ఓ ప్రైవేట్​ బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.  


12 మంది మృతి 


ఈ బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రమాదంలో మృతిచెందిన వారితో పాటు గాయపడిన వారిని స్థానిక కోపాలీ రూరల్​ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారని పోలీసులు తెలిపారు.  రాయ్ గడ్ ​లోని లోయలో బస్సు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎస్​పీ సోమ్​నాథ్​ గర్గ్​ మీడియాకు తెలిపారు.