సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) కూటమి  వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పశ్చిమ యూపీలోని స్థానాల అభ్యర్థుల లిస్ట్ వెల్లడించింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 10 మరియు 14 తేదీల్లో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 29 స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ 19 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎస్పీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.


షామ్లీ, పుర్కాజీ, ఖతౌలీ, నెహ్‌తోర్, బాగ్‌పత్, లోని, మోదీనగర్, హాపూర్, జేవార్, బులంద్‌షహర్, సయానా, ఖైర్, సదాబాద్, చాటా, గోవర్ధన్, బల్దేవ్, ఆగ్రా దేహత్, ఫతేపూర్ సిక్రీ, ఖైరాఘర్‌లలో ఆర్ఎల్ డీ పోటీ చేస్తుంది. మరోవైపు కైరానా, చార్తావాల్, కిథోర్, మీరట్, సాహిబాబాద్, ధలౌనా, కోల్, అలీగఢ్, ఆగ్రా కాంట్, బాహ్‌లలో సమాజ్ వాది పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.


ఆర్ఎల్ డీ, ఎస్పీ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పొత్తుతో ఉన్నాయి. అప్పటి నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికలలోనూ కలిసి పోటీ చేశాయి. 


రాజీనామాల పర్వం


మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా యోగి కెబినెట్ నుంచి మరో మంత్రి రాజీనామా చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నేత ధరమ్ సింగ్ సైని తన మంత్రి పదవికి నేడు రాజీనామా చేశారు.


ఇప్పటికే స్వామి ప్రసాద్ మౌర్య, ధారా సింగ్ చౌహాన్.. యోగి కేబినెట్‌కు రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సైనీ కూడా అదే దారిలో వెళ్లనున్నారు. ప్రస్తుతం నకుడ్ అసెంబ్లీ స్థానానికి సైనీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యోగి కేబినెట్‌లో ఆయుష్, ఆహార భద్రత, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేశారు.


ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనంది బెన్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం తన సెక్యూరిటీ కవర్, అధికారిక నివాసాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పారు సైనీ.


సమాజ్‌వాదీ చెంతకు..





రాజీనామా చేసిన అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను కలిశారు ధరమ్ సింగ్ సైనీ. పార్టీలోకి సైనీని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయనతో ఉన్న ఫొటోను అఖిలేశ్ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.


సైనీ కూడా అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి 2016లో భాజపాలో చేరారు. ఇప్పుడు సమాజ్‌వాదీ గూటికి చేరుతున్నారు.


మరో ఎమ్మెల్యే..


ఈరోజు ఉదయం మరో ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ కూడా పార్టీకి రాజీనీమా చేశారు. ప్రస్తుతం ఆయన శిఖోహాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయనతో కలిపి ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడారు.


మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యోగి కేబినెట్ నుంచి బయటకు వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య.. జనవరి 14న భాజపాకు పెద్ద షాక్ తగులుతుందని వ్యాఖ్యానించారు.


Also Read: UP Election 2022: మాట తప్పని ప్రియాంక గాంధీ.. 40 శాతం మహిళలకే టికెట్లు.. ఉన్నావ్ బాధితురాలి తల్లికి ఛాన్స్


Also Read: UP Election 2022: యోగి కేబినెట్‌లో మూడో వికెట్ డౌన్.. యూపీలో మరో మంత్రి రాజీనామా


Also Read: UP Election 2022: దెబ్బ అదుర్స్ కదూ..! అఖిలేశ్‌ ప్లాన్‌కు అడ్డంగా దొరికిపోయిన యోగి.. ఇక కష్టమే!