బంగాల్ జలపాయ్‌గురి దొమోహనీ వద్ద గువాహటి-బికనేర్ ఎక్స్‌ప్రెస్ 15633 (యూపీ) రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 20 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు రైల్వేశాఖ తెలిపింది.
సమాచారం అందిన వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, మెడికల్ వ్యాన్‌ను ఘటనా స్థలానికి పంపినట్లు భారతీయ రైల్వే తెలిపింది. సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. 12 బోగీలు పట్టాలు తప్పాయని పేర్కొంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రుల్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 30 అంబులెన్స్‌లను ఘటనా స్థలికి పంపించారు.
రైలు హఠాత్తుగా ప్రమాదానికి గురికావడం వల్ల అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో రైలు దిగి దూరంగా పరుగులు తీశారు.
సహాయక బృందాలు..
రెస్క్యూ ట్రైన్‌ను వెంటనే సంఘటనా స్థలానికి పంపింది రైల్వేశాఖ. ఇందులో రైలు బోగీలను కట్ చేసి ప్రయాణికులను బయటకు తీసేందుకు అవసరమైన సామగ్రి ఉంది. ప్రయాణికుల సమాచారం కోసం రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్ 8134054999ను ప్రకటించింది.
పరిహారం ప్రకటన..
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైనవారికి రూ.25 వేలు పరిహారం ప్రకటించింది ర్వైల్వేశాఖ. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెళ్లనున్నారు. ఇప్పటికే పరిహారం ప్రకటించామని ఆయన తెలిపారు.
ప్రధాని ఫోన్..
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి ప్రమాద వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకున్నారు. సహాయకచర్యలను వేగంగా చేయాలని సూచించారు. ఘటనపై మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేశారు.