ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం అత్యవసర సూచన చేసింది. ఖార్కివ్‌లో ఉన్న మన పౌరులు తక్షణమే ఆ నగరాన్ని విడిచిపెట్టాలని ట్వీట్ చేసింది.
ఈ రోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పెసోచిన్, బాబే, బెజ్లియుడోవ్కాకు వీలైనంత త్వరగా చేరుకోవాలని తెలిపింది. ఖార్కివ్‌లో రష్యా సైనికులు మంగవారం చేసిన షెల్లింగ్, పేలుడులో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన నవీన్.. ఆహారం కోసం బయటకు వచ్చిన సమయంలో పేలుడు జరిగింది. ఆ పేలుడులో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులుగా ఖార్కివ్ లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో భారత రాయబార కార్యాలయం.. భారతీయులు ఖార్కివ్‌ను వీడి వెళ్లాలని అత్యవసర సూచన చేసింది.
రష్యా దర్యాప్తు
భారత విద్యార్థి నవీన్ మృతిపై రష్యా స్పందించింది. విద్యార్థి మృతిపై విచారణ చేపడుతామని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ తెలిపారు.
మూడో ప్రపంచ యుద్ధం
మూడో ప్రపంచ యుద్ధంపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణ్వాయుధాలతోనే చేయాల్సి ఉంటుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఉక్రెయిన్ అణ్వాస్త్రాల సేకరణకు రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదన్నారు.
ఉక్రెయిన్ పోరాటం
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా ఏడో రోజు కూడా దాడులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌లోని మరో ప్రధాన నగరం ఖెర్సన్‌ను రష్యా సైన్యం చేజిక్కించుకున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. అయితే ఇన్ని రోజులపాటు యుద్ధం చేయాల్సి వస్తుందని రష్యా కూడా ఊహించలేదని పలు నివేదికలు వస్తున్నాయి. ఉక్రెయిన్ ఈ రీతిలో ప్రతిఘటిస్తోందని రష్యా అనుకోలేదట. తమ దేశం కోసం ప్రాణాలైన ఇచ్చేస్తాం కానీ.. రష్యాకు తలొగ్గే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. దీంతో రష్యా సైన్యం కూడా దాడులను తీవ్రం చేసింది.
Also Read: Russia Ukraine War: చల్లబడిన రష్యా సైనికులు- తిండి లేక, బండిలో ఇంధనం లేక, అంతా తికమక!
Also Read: Baba Vanga Prediction: పుతిన్ గురించి షాకింగ్ విషయాలు! రష్యాను ఎవరూ ఆపలేరా?: బాబా వాంగ కాలజ్ఞానం