Patanjali PNB Credit Card: నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో (NPCI) భాగస్వామ్యంతో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) బుధవారం కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను (Co Branded credit cards) ఆవిష్కరించాయి. రూపే (Rupay)  ప్లాట్‌ఫామ్‌ ద్వారా వీటిని ఆఫర్‌ చేస్తున్నారు.


ఈ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులతో మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొనుగోలు చేసిన సరకులు, వస్తువులపై 5-10 శాతం వరకు రాయితీ ఇస్తారు. కార్డు దారునికి రూ.5 లక్షల వరకు బీమా (Insurance) లభిస్తుంది. ఇతర సౌకర్యలూ ఉంటాయి.


ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన 'ఆత్మ నిర్భర్ భారత్‌'లో (Atmanirbhar Bharat) తమ వంతు పాత్ర పోషించేందుకు కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను ఆవిష్కరిస్తున్నామని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ (Patanjali Ayurved Limited) ఎండీ ఆచార్య బాలకృష్ణ అన్నారు. యోగా గురు బాబా రాందేవ్ (Baba Ramdev) ఇచ్చిన 'స్వదేశీ' పిలుపును ఆయన ప్రశంసించారు. తక్కువ వేతనాలు పొందే ప్రజలకు తమ కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపారు. 49 రోజుల వరకు ఈ కార్డు ప్రయోజనాలను పొందొచ్చని, ఆ మరుసటి రోజు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 


రోజూ అవసరమయ్యే పతంజలి ఉత్పత్తులు మాత్రమే కాకుండా మిగతా బ్రాండ్ల ఉత్పత్తులనూ ఈ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆచార్య బాలకృష్ణ అన్నారు. ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా అందరూ పతంజలి గొడుగు కింద ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.


'ఆత్మ నిర్భర్ భారత్‌'కు ఈ కార్డు ప్రోత్సాహం ఇస్తుందని యోగా గురు బాబా రాందేవ్‌ అన్నారు. కోటి మంది ఈ కార్డు ద్వారా లబ్ధిపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తన సోషల్‌ మీడియాలో ఐదు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపారు. అందులో కనీసం కోటి మంది దృష్టికి ఈ కార్డు వెళ్తుందని వెల్లడించారు. 'నా యోగా సెషన్లు, పతంజలి మెగా స్టోర్లకు వచ్చే వారితో నేను మమేకం అవుతాను. ఈ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ రూ.10 లక్షలు. తమ ఆదాయాల మేరకు ప్రయోజనాలు పొందొచ్చు' అని రాందేవ్‌ వెల్లడించారు.