Lalu Prasad Yadav hospitalized: ఆర్‌జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ భుజానికి ఫ్రాక్చర్ అయింది. ఇంట్లో మెట్లు దిగుతుండగా ఆయన కాలుజారి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ వీపుపై కూడా గాయాలయ్యాయి.






దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ.. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితమే బెయిల్‌పై లాలూ విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు.


అనేక సమస్యలు


లాలూ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ తరుణంలోనే ఆయనకు ఈ ప్రమాదం జరిగింది.


మరో కేసు


లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన కుమార్తె ఇళ్లలో సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ఇటీవల సోదాలు చేసింది. అవినీతిపై లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. లాలూకు సంబంధించి సీబీఐ శుక్రవారం 15 చోట్ల సోదాలు నిర్వహించింది.


2004-2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్‌ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైల్వే శాఖకు చెందిన ఉద్యోగ నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది. 


వీటి ఆధారాల కోసం ఒకేసారి లాలూ ప్రసాద్‌ ఇంటితో పాటుగా రాష్ట్రీయ జనతాదళ్‌కు సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉందని వారిని నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది.


Also Read: Agnipath Scheme: 'అగ్నిపథ్‌'ను రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్- వచ్చే వారం విచారణ


Also Read: Sharad Pawar on Eknath Shinde: '6 నెలల్లో కూలిపోతుంది'- షిండే సర్కార్‌పై పవార్ సంచలన వ్యాఖ్యలు